About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

13, జూన్ 2010, ఆదివారం

ఎక్కడ ప్రేమకు పరిపూర్ణత?

ఎక్కడో ఆలోచనల అంబరాన ఊరేగుతుంటాను
ఏదో మూల ఒక భావం తళుక్కు మంటుంది
ఆలోచనలకు అంటిన అనుభూతి అగరొత్తై రాజుకుంటుంది

ఎండిన ఎడారికి ప్రాణం పోసే ఒయాసిస్సే ఈ ప్రేమా?
అనుబంధాలన్నీ ఆవిరై కోరికల గుఱ్ఱాలమీద పరిగెడుతున్నప్పుడు
అనుకోకుండా ఓ బంధం ప్రేమను చిలుకరిస్తుంది
వెతుకుతున్నదేదో కాలికి తగిలినట్టు చప్పున ఆగిపోతాను
ఆ బంధానికి అల్లుకు పోతాను

ఎప్పుడో విసిరిన రాయికి ఇప్పుడు అలలు కల్లోల పడతాయి
అలసిన తనువుకు తగిలిన పిల్ల తెమ్మెరకదా ఈ ప్రేమ
మోడులా బ్రతికేస్తుంటే చినుకు స్పర్శలా వచ్చి పలకరిస్తుంది

గుండెలో పేర్చిన గులకరాళ్ల గుట్టలో వెలుగేదో గోచరిస్తుంది
ఆ వెలుగును అన్వేషిస్తూ ఒక్కో రాయీ పెకిలిస్తాను
పిచ్చి భ్రమతో ఈ గుట్టను పేర్చాను
ఇప్పుడు అవేవీ పనికిరావని దేనికోసమో వెతుకుతున్నాను
నే వెతికే వెలుగే ప్రేమేతే అదే నాకు కావాలి
పరిపూర్ణంగా కావాలి

అందీ అందని అరా కొరా మధురానుభూతుల సారాంశం ప్రేమే అయితే
ఈ మధుర భావన ఆజన్మాంతం నిలిచేదెలా?
ఏమిటీ ప్రేమ? ఎక్కడ ప్రేమకు పరిపూర్ణత? ఎందుకీ ఎదకోత?

6 కామెంట్‌లు:

  1. ప్రేమకు పరిపూర్ణతా! ఏమో... అయినా మనసు ప్రేమ విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ పూర్తి తృప్తి లేదా పూర్తి అసంతృప్తి పొందిందంటే ఇప్పటివరకూ పేర్చినవి గులకరాళ్ళని, ఇంకేదో అన్వేషించాలని బయలుదేరటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అన్వేషణలు, ప్రశ్నలు లేని నిర్వికార స్థితిని పొందటం కొందరు యోగులకు సాధ్యం కావచ్చు. కానీ వికారాలాకు ఆలవాలమైన మనసుతో ప్రేమలో పరిపూర్ణత అనేది సాధ్యమా???? తెలీదు.
    అంతొద్దు.....అంటారా! అయితే ఒ.కె. యదకోత కాదు, ఎదకోత కదా!
    ఏమైనా, మీరు లేవదీసిన ప్రశ్న ఆలోచింపచేస్తోంది. బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
  2. ప్రేమ గురించి కొత్త కోణం..! నాకు నచ్చింది.. ! మనిషి కి ఆలోచనలనేకం .. అందులో ఆకర్షణలనేకం..
    వీటన్నికికీ బదులు చెప్పి .. తను ముందుకు వెళ్ళడానికి .. ప్రేమ చాలా రాళ్ళే పేర్చాలి..

    రిప్లయితొలగించండి
  3. మిత్రమా, మీ అందరి టపాలు చదవడానికి వచ్చేసాను.
    బాగా రాసారు.
    ప్రేమకు పరిపూర్ణత! ఆలోచింపచేసే ప్రశ్నే ....

    రిప్లయితొలగించండి
  4. వియోగం లోనే ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ ...

    రిప్లయితొలగించండి
  5. మీ భావాలు చాలా బావున్నాయండీ. చాలా బావుంది ఈ కవిత

    రిప్లయితొలగించండి
  6. పరిపూర్ణ ప్రేమకు చిరినమా రాధా మాధవులదేనేమో! చాలా బాగుందండీ! చక్కని వ్యక్తీకరణ! ఇంపైన పదాలు!

    రిప్లయితొలగించండి