About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

14, మే 2010, శుక్రవారం

మనసుని జయించటం ఎలా? - 3 నేటి యువతరానికి మీరు ఇవ్వవలసినది

మన మనసు ఎప్పుడొ ఒకప్పుడు మన మాట వింటోంది. కానీ కావాలనుకున్నప్పుడు, కావలసిన విషయంలో వినేటట్లు ఎలా చేయాలి?

ఒక్కొక్కరిని చూసినప్పుడు వీరికి మనో బలం ఎక్కువ అనుకుంటూ ఉంటాం. అంటే వారు అనుకున్న పని అనుకున్నట్టుగా చేసుకో గల సమర్ధత కలిగినవారు. మరొకరిని చూసి వీడి కసలు కుదురే లేదు. ఓ క్షణం ఆపని చేస్తాడు, మరో క్షణం ఈ పని చేస్తాడు. ఏదీ పూర్తిగా చెయ్యడు అనుకుంటాం. ఆ కుదురులేనిది అతనికి కాదు, అతని మనసుకి. ఇటువంటి కుదురు లేని మనసుని కుదుట పరచడం ఎలా?

ఎదిగే కుర్రవాడు సిగరెట్ తాగడం మొదలు పెట్టాడని తండ్రికి తెలిసింది. అప్పుడెలా ప్రవర్తించాలి? పిలిచి నాలుగు వాయించి నువ్వు సిగరట్ తాగడం మళ్లీ చూశానో తోలుతీస్తా అని చెప్పాడనుకోండి ఏమవుతుంది? త్రాగడం మానేస్తాడా? మానడు. దొంగతనంగా తాగుతాడు. పైగా తండ్రికి సిగరెట్ తాగే అలవాటు ఉండింది అనుకోండి, నాన్న తాగుతూ నన్ను తాగవద్దంటాడా? అని ఓ రకమైన పెంకి తనం అతనిలో పెరుగుతూ వచ్చి ఓ రోజు తండ్రి ఎదురుగా సిగరెట్ తాగే స్థితికి కూడా అతను రావచ్చు. కాబట్టి పిల్లవాడికి మానమని చెప్పాలంటే మనకు మానగల సమర్థత ఉండాలి. అసలు అంత దాకా రాకుండానే ఎప్పుడో మానేయాలి. పిల్లలు బాగు పడాలంటే మనకు కొన్ని నియమాలు తప్పవు. తమకోసం మానలేని ఎన్నో అలవాట్లను పిల్లల కోసమని మానేసిన వారుంటారు.

గాంధీజీ దగ్గరకు ఓ తల్లి పిల్లవాడిని తీసుకు వచ్చి, మహాత్మా మావాడు బెల్లంతింటున్నాడు. మీరు మానేయమని చెప్పండి, మీరు చెప్తే వింటాడు అని అడిగిందట. దానికి ఆయన ఓ 6 నెలలు ఆగి రమ్మని చెప్పారట. అలాగే 6 నెలల తరువాత పిల్లవాడిని తీసుకు వచ్చింది. అప్పుడు గాంధీజీ పిల్ల వానితో " బెల్లం ఎందుకు తుంటున్నావు నాన్నా!? అలా రోజూ తింటే జబ్బు చేస్తుంది. మన దేశానికి ఆరోగ్య వంతమైన ధృఢమైన యువత ఎంతో అవసరం. కనుక తినడం మానేయి" అని చెప్పారు. పిల్ల వాడు అలాగే మానేస్తాను అని చెప్పాడు. అప్పుడు తల్లి ఇదే మాట మీరు ఆరు నెలల క్రింద చెప్పి ఉండ వచ్చు కదా? మరి ఎందుకు చెప్పలేదు? అని అడిగింది. దానికి గాంధీజీ " నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. మానమని పిల్లవానికి చెప్పాలంటే నేను మాని చెప్పగలగాలి. అలా మానలేక పోతే నేను పాఠించని నియమం అతనిని పాఠించమని నేను చెప్పినా గౌరవం ఉండదు. నేను ఆచరించి చూపగలిగనాడే నామాటలకు విలువ కదా! అందుకే ఆ చిన్న మాట చెప్పడానికి నాకు 6 నెలలు పట్టింది " అని చెప్పారు.

మనలో నిజాయితీ విలువ ఎంతో మన మనసుకు తెలుసు. ఇది మనసుతో పని కనుక మరింత జాగ్రత్తగా మెలగాలి. మన బుద్ధి మంచి దైన నాడు మనసుకు మంచి చెప్ప వచ్చు. కనీసం చిన్న చిన్న నియమాలైనా జీవితంలో మీరు పాఠించి ఉంటే మీ మనసు మీ మాట వింటుంది.మీకు బ్లాగులంటే చాలా ఇష్టం. బ్లాగులు చదువుతూ, కామెంట్లు రాస్తూ, కొత్త టపాలు రాస్తూ ఉన్నారు. అలా ఉంటే ఏ సమస్యా ఉండదు. కానీ ఉండరే! ఓ కొత్త టపా రాస్తారా!? రాసిన దగ్గరనుండీ ఒకటే ఉత్సుకత. ఈ పాటికి నా టపా ఎంతమంది చూశారో? దానికి ఎన్ని కామెంట్లు వచ్చాయో? అసలు ఎవరికైనా నచ్చిందో లేదో? ఇలా ఎన్ని ప్రశ్నలో . ఏంచేస్తాం ఇక రాసిన దగ్గరనుండీ కంప్యూటర్ ముందే కూచుని మాటి మాటికీ రీఫ్రేష్ నొక్కుకుని చూసుకుంటూ ఉంటాం. ఈ లోపు ఖాళీగా కూర్చోలేక కూడలికి వెళ్లి బ్లాగులన్నీ చుట్టి వస్తాం. కాలం గిర్రున తిరుగుంది. చూస్తూ చూస్తూ 4, 5 గంటలు గడిచిపోతాయి. ఆరోజు ఏదో చేయాలనుకున్న పని మర్చిపోతారు. గుర్తున్నా చేసే టైమ్ ఉండదు. ఈ తతంగం ఇంట్లో నెట్ ఉండి క్రొత్తగా బ్లాగు మొదలు పెట్టిన ఎవరికైనా అనుభంలోనిదే అయి ఉంటుంది.

రోజూ టీ త్రాగడం అలవాటు. రోజుకి 20 సార్లు త్రాగడం వ్యసనం. రోజూ బ్లాగులు చదవడం అలవాటు. రోజంతా బ్లాగులు చదవడం వ్యసనం. ఏదైనా ఒక పని అలవాటుగా ఉన్నంతకాలం ఏ సమస్యాలేదు. అదే పని వ్యసనంగా మారితే అది మంచి వ్యసనం కానివ్వండి, చెడు వ్యసనం కానివ్వండి దానిని నిరోధించ వలసిందే. లేదంటే మన మనసు దారితప్పుతున్నట్టే.

రోజూ చూసే ఓ అమ్మాయిని ప్రేమిస్తూ మానసులోనే ఊహలెన్నో చేసుకుంటూ ఉన్నారనుకోండి అది మనసుకి ఓ కొత్త అలవాటు. అదే పరిపాటి అయితే అదో వ్యసనం. అను క్షణం ఆమే గుర్తుకు వస్తుంది. మనసు ఏవేవో కలలు కంటుంది. ఏపనీ చేయ బుద్ధికాదు. నిద్రకూడా పట్టదు. ( వ్యసనం ఏదైనా ఇవన్నీ సహజ లక్షణాలు. కాకపోతే ప్రేమలో వీటి తీవ్రత ఎక్కువ ) చివరికి మనసుని అదుపు చేయలేక ఆమెకి మీ ప్రేమని చెప్పేస్తారు. ఆమెకు కూడా ఇష్టమైతే మీ అదృష్టం పుచ్చి నట్టే. కానీ కాదంటే మీ పరిస్థితి ఏమిటి? మీ మనసు ఆ అపజయాన్ని జీర్ణించుకోలేదు. ఆమెను ఊహించ కుండా ఉండలేదు. క్షణ క్షణం కళ్లముందు నరకం కనిపిస్తుంది. ఆమెను చూసిన ప్రతి సారి మనసు రంపపు కోతకు గురి అవుతుంది. ఈ స్థిని దాటే సత్తా నేటి తరానికి ఉందా. ఇటువంటి స్థితే కదా నేడు మనం రోజూ వింటున్న, కంటున్న ఆత్మ హత్యలకు, యాసిడ్ దాడులకు కారణం. ఆమెను గురించి ఆలోచించకుండా ఉండలేరు. అలా అని గుర్తుకు వచ్చిన ప్రతిసారీ కలిగే వేదనను భరించలేరు.

ఈ స్థితి నుండి బయట పడే మార్గం ఉందా? ఉంది కానీ అది మీరు తెలుసుకోలేరు. ఎందుకో తెలుసా? ఆనాడు టీ మంచిదే కదా అనుకుని అది వ్యసనంగా మారినా చూస్తూ ఊరుకున్నారు కనుక. కంప్యూటర్ వాడడం నిగ్రహించడానికి ఏనాడూ ప్రయత్నించ లేదు కనుక. మీకు అంతకుముందు దేనినీ అదుపు చేసుకున్న అలవాటు, అనుభవమూ లేదు కనుక.

అలాకాక మీరు నా నెట్ బ్రౌజింగ్ ( లేదా ఏదైనా అలవాటు ) వ్యసనంగా మారింది. దానివల్ల నా విలువైన కాలం వృధా అవుతోంది. నేను దీనిని అదుపులొ ఉంచుకోవాలి అనుకున్నారనుకోండి పరిస్థితి మరోలా ఉంటుంది.

నేను ఓ సంవత్సరమంతా నెట్ కి దూరంగా ఉంటాను అనుకున్నారనుకోండి ఉండగలరా? ఉండలేరు 3 రోజుల్లో నే మళ్లీ మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే మీ సంకల్పం మీకే అసమంజసంగా అనిపిస్తుంది. అదే ఓ నెలంతా నేను నెట్ ముట్టు కోను అనుకుంటే అది కొంత నయం. దానికంటే ఓ వారం అనుకోవడం మేలు. అదే ఓ రోజు అనుకున్నరనుకోండి మీరు గెలుపు దారిలో పడినట్టే. " చిన్న ఆరంభాలె పెద్ద పనులను సాధింపచేస్తాయి ". అది నిజం. ఒక రోజు మీరు నెట్ కి దూరంగా ఉండడం సులువైన పనే. ఓ విధంగా చాలా సులువైన పని. కనుకు దానికి మనసు పెద్ద గొడవ చేయదు. మీమాట వింటుంది. అలా నెట్ కు దూరంగా ఉండడం వల్ల కలిసొచ్చిన సమయాన్ని ఓ మంచి అలవాటుకు పునాది వేయడానికి వినియోగించండి. అలా రెండు మూడు సార్లు అయిన తరువాత రోజు నుండి మీ నియమాన్ని ఓ 3 రోజులకి పెంచండి. తరువాత వారం, తరువాత ఓ నెల, రెండు నెలలు అలా అలా...( నేను మొన్నీ మధ్యనే ఓ 4 నెలలు పూర్తిచేసుకున్నట్టున్నాను. ) అయితే ఎక్కడా తొందర ఉండకూడదు. నెమ్మదిగా లక్ష్యాన్ని పెంచుకోవాలి. ఆ సమయం విలువెంతో మనం చేసుకున్న మరో మంచి అలవాటు చెబుతుంది. లక్ష్యం పెరిగే కొద్దీ మనమీద మనకున్న నమ్మకం పెరుగుతుంది. ఆ మనో బలమే ఇతరులకు కష్ట తరమైన పనులను సైతం మనకు సుసాధ్యం చేస్తుంది. మన పెద్దలు పాఠించే ఉపవాసాలు, నియమాలు, అయ్యప్ప స్వామి దీక్ష మొదలైనవాటి అంతరార్థం మన మనో బలాన్ని పెంచడమే అనిపిస్తుంది.

ఇలా పెరిగిన మనో బలమే మనకు ఎదురైన పెద్దపెద్ద కష్టాలను సైతం ఎదిరించి ముందుకు నడచేలా చేస్తుంది. ఈ మనో బలం లేకే కదా నేటి యువతరం ( విద్యార్థులు, ప్రేమికులు ) ఆత్మహత్యలు చేసుకునేది. కాబట్టి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే మనం ఇవ్వవలసింది మంచి చదువులు, కూడ బెట్టిన ఆస్థులు కాదు. మనో బలం కావాలి వారికి. ముందరి తరాల వారికీ , నేటి తరానికీ తేడా అక్కడే. చిన్న దానికే అతిగా స్పందిచే నేటి తరానికి నియమంగా ఉండడం వల్ల లాభామేమిటో మనం వివరంగా చెప్పగలగాలి. మనసు మాట వింటూ పోతే మనం ఎంత పతనమవుతామో వివరించాలి. దాని శక్తిని తెలిపి, ఆ శక్తిని ఓ ఆయుధంగా మలచే యుక్తి నేర్పాలి. అదే వారి బంగారు భవితకు బాటలు వేస్తుంది.


మంచి దైనా, చెడు దైనా వ్యసనం వ్యసనమే. అది మనను నిప్పులా దహించక మానదు. కాబట్టి అలవాటు వ్యసనంగా మారే చిన్న గీతను గుర్తించి ముందు గానే జాగ్రత్త పడడం అన్నివిధాలా శ్రేయస్కరం. ముందు మనం చేయగల చిన్న పనులను నిర్ణయించుకోవాలి. చిన్న చిన్న నియమాలే పెద్ద లక్ష్యాలకు సోపానాలు. మనం పెట్టుకున్న నియమాలే మనకు శ్రీరామ రక్ష.

7 వ్యాఖ్యలు:

 1. The Gandhiji example you gave ia actually the story about Ramakrishna Paramahamsa and a Kid.
  Anyway, good post!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నాకు తెలిసి ఇది గాంధీగారి కథేనండీ. ఇంకా ఎవరైనా చెప్తారేమో చూద్దాం. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బాగుంది ....మీరు ఉదహరించింది రామకృష్ణ పరమహంస కి సంభందించినది ....."ఎవరికయినా ఏదైనా సలహా ఇచ్చే ముందు మనం ఆచరించి ఆ తరువాత చెప్పాలని హితవు చెబుతారు ,ఒక తల్లి కొడుకు మిఠాయిలు అధికంగా తింటున్నాడని అది ఎలా మాన్పించాలో తెలియక పరమ హంస వద్దకి తీసుకువస్తుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. బాగుందండి మీ విశ్లేషణ. మీరు చెప్పిన సంఘటన రామకృష్ణులవారిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వా... అమ్మా... :(

  మరి నేను గాంధీ గారి గురించి చదివాను ఈ కథ. అందరూ కాదంటున్నారు. ఒప్పుకోక తప్పటం లేదు. వా... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. bagunnara?
  baaga raseru...mi vishleshana bagundi.
  manasuni jayinchadamu chaala kashtam,sadana tho jayinchavachu.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. విశ్వ ప్రేమికుడు గారూ...,

  నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
  ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
  నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
  మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

  తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
  తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
  హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

  - హారం ప్రచారకులు.

  ప్రత్యుత్తరంతొలగించు