About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

1, సెప్టెంబర్ 2010, బుధవారం

నల్లనయ్య మా ఇంటికీ వచ్చాడు


కారు మబ్బులాగ కమ్మని కబురు లాగ
చల్లని చినుకు లాగ చెలి నగవు లాగ
నేడు నల్లనయ్య మా ఇంటికీ వచ్చాడు

మలయ మారుతమై వచ్చాడు
తెలియని మాయేదో చేశాడు
మెరిసే మెరుపై వచ్చాడు
కనికట్టు చేసి వెళ్లాడు..

చూసే చూపులో పలికే మాటలో...
నా ఉచ్ఛ్వాసలో నిచ్ఛ్వాసలో...
మదిలో మెదిలే ప్రతి ఊహలో...
అన్నిటా తానే అయి వెలుగొందాడు

రాతి హృదయము కదానాది
మరి ఆర్ద్రమేల ఆయెనో కదా..?

లీలా మానుష విగ్రహుని
ప్రేమకు పులకించుటే తెలుసును
అతని వేణు నాదాన ...
మది మరులు గొలుపుటే తెలియును

అతని ఎదుట నే పురుషుని కాదా
రాధలా ఇంత ఆరాట మేలనో?

ఏమో వెదురును వేణువు చేసి
మదిని మరపించినా...

కాళింది సరసులో కాలనాగు
పడగల పై నాట్యమాడినా...

ప్రాణులన్నిటిని పకృతిగ చేసి
పురుషోత్తముడు తానై ఏలినా...

అంతా అతని మాయే కదా..

వద్దు వద్దు అనుకుంటూనే ఉంటాను
ఈ క్రిష్ణుని ఆగడాలు ఇక చాలనుకుంటాను

చిన్న పిల్ల వాడిలా వస్తాడు
అల్లిబిల్లి మాటలేవొ చెప్తాడు

కమ్మని కలలా వస్తాడు
ఓపలేనంత విరహమిచ్చి వెళతాడు

అమ్మలోని అమాయకతలా...
ఆనంద అంబుధిలా ..
కదిలే కాలంలా...
ప్రవహించే నదిలా..
మాటి మాటికీ వస్తాడు మురిపాల తేలుస్తాడు
ప్రేమలో నను ముంచి వేస్తాడు...

అలాటి కృష్ణుడు నేడు మా ఇంటికీ వచ్చాడు
వర్షించే మేఘమై
కారు మేఘాలలో మెరిసే మెరుపై
నను నిలువునా తడిపే తలపై...

పుట్టిన రోజున ఎవరైనా అందరినీ విందుకు పిలవడం పరిపాటి. మరి మన నల్లయ్యేమో తానే అందరిళ్లకూ వస్తాడు. పాలు వెన్నలతో పాటు మన మనసులను దోచుకు వెళతాడు. అయినా తానంటే మనకు తీరని మక్కువ. చూసినకొద్దీ చూడాలనిపిస్తాడు. అతని ప్రేమను పొందిన కొద్దీ మరింత పొందాలని పిస్తుంది. అదే కృష్ణ మాయ.

అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

14, ఆగస్టు 2010, శనివారం

పరవశం

ఎగసే అల అయినా తిరిగి భూమిని తాకుతుంది. రగిలే జ్వాలైనా ఏదోనాటికి శాంత పడుతుంది.ఉదయించే సూర్యుడు కూడా సాయంసంధ్యకు మాయమవుతాడు. చంద్రుని వెన్నెల చీకటి ఉన్నంతవరకే! చిత్రంగా నాలో ఉదయించిన ప్రేమ మాత్రం అంతకంతకు అనంతమౌతున్నది.

ఏనాడు పడిన బీజమో ఇది. అమ్మ చేతి గోరు ముద్దల నాటిదేమో! గోటి బిళ్లల ఆటల తోటి దేమో! అంకురానికి మూలమేమిటని అడిగితే ఏమి చెప్పగలను? అమాయకపు నవ్వు తప్ప.! అందుకు కారణం నీవని తెలుసు. ఆనాటికే ఎవరు చెప్పారు నీ ఎరుక!? పరమేశునికే ఎరుక! :)

మేడపైన ఒంటరిగా కూర్చున్నప్పుడు పలకరించే పిల్లగాలి పరిచయమేగా..!? నీలాకాశంలో నల్లని కొంగల బారును చూశావా నీవెపుడైనా? పచ్చటి ప్రకృతి ఒడిలోకి జారే ఎఱ్ఱటి పసిపాపడినెరుగుదువా!? చిరు చినుకులు పడుతున్నప్పుడు దారి ప్రక్కన బండి వాడి వేడివేడి జిలేబీల రుచీ..!? వీటన్నిటికంటే తీయనైనది నా అనుభూతి.

నీ ఊహల్లో ఒంటరిగా నాలో నేనే నవ్వేస్తూ దారంట పోతుంటే... దూరంగా కొండపై మ్రోగే గుడిగంటలు, కేరింతలు కొడుతూ పరిగిడుతున్న స్కూలు పిల్లలు, చెంగు చెంగున ఎగిరే తువ్వాయి తుంటరి చేష్టలు, ఆకలి తీరిందన్న సంతోషంలో అవ్వ ఇచ్చిన బోసినవ్వులు, గూటికి చేరే గోరువంకలు... ఒక్కటేమిటి అన్నీ నువ్వే... అన్నిటా నీవు నింపిన ప్రేమే... అంతగా ఆక్రమించావు నన్ను!

అయినా నీవెవరో తెలియదు నేటికీ. నీరూపం అసలె తెలియదు. ఇనాళ్లూ ఎలాగడిచాయన్న ఎఱుకే లేదు. అన్ని కాలాలూ వంసతాన్నే తలపిస్తున్నాయి నీ ఊ హలతో... స్నేహితులు నర్మగర్భంగా నవ్వుతున్నారు నాకో సహచరి కావలెనని. పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు. నీ వస్తావన్న ఊహే నా ప్రేమకు ఊపిరులూదుతున్నది. ఏ నాటికి నీ కాటుక కనులలో నా రూపు నిలిచేనో!? తొలి ముద్దు తీపి తెలిసేనో...!? ఆ ఊహకే ఇంతటి పరవశమైతే.., నీవే ఎదురైన క్షణాన, కనులు కనులతో పలకరించిన నిమిషాన అమరుడినై పోతానేమో..!


మా పెరటి తోటలో గడ్డి పూలను పరచి, మల్లె తీగను పందిరి వేసి, పండువెన్నెలను దీపం చేసి, పిల్ల గాలులను వింజామరలు చేసి నీ రాకకై వేచి ఉంటిని. పరుగున రావే నా నా ప్రణయ దేవతగా.!

29, జూన్ 2010, మంగళవారం

మీ blogger బ్లాగులో cool smilies ను చేర్చాలను కుంటున్నారా?



మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఈ వార్త మీతో పంచుకుంటున్నందుకు. బ్లాగులో మన emotions ని తెలుపడానికి yahoo smilies ని చేర్చడం ఎలాగా అని ఆలోచిస్తున్నారా? అది ఇప్పుడు చాలా వీజీ :) :)
మీ డిజైన్ ( కొత్తగా వచ్చిన ) పేజీకి వెళ్లి HTML ను సవరించు నొక్కండి. అక్కడ ఉన్న HTML లో మొదటి లైను నుండి నెమ్మదిగా వెతుకుతూ వెళ్తే 5, 6 lines లోపలే మీకు head> అని కనపడుతుంది. సరిగ్గా ఆ line కి పైన నేను ఈ క్రింద ఇచ్చినది copy past చేసెయ్యండి.





తరువాత save settings నొక్కండి. అంతే మీ బ్లాగులో కూల్ కూల్ స్మైలీస్ దర్శనమిస్తాయి. ఓ సారి మీ కామెంట్ సెక్షన్ లో ఓ స్మైలీతో కామెంటి చూసుకోండి.
ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ చూడండి. http://journal.adityamukherjee.com/essay/blogger-smilies/#p:1

ఇలా అన్నమాట :) :D :P :( :$ ;)

13, జూన్ 2010, ఆదివారం

ఎక్కడ ప్రేమకు పరిపూర్ణత?

ఎక్కడో ఆలోచనల అంబరాన ఊరేగుతుంటాను
ఏదో మూల ఒక భావం తళుక్కు మంటుంది
ఆలోచనలకు అంటిన అనుభూతి అగరొత్తై రాజుకుంటుంది

ఎండిన ఎడారికి ప్రాణం పోసే ఒయాసిస్సే ఈ ప్రేమా?
అనుబంధాలన్నీ ఆవిరై కోరికల గుఱ్ఱాలమీద పరిగెడుతున్నప్పుడు
అనుకోకుండా ఓ బంధం ప్రేమను చిలుకరిస్తుంది
వెతుకుతున్నదేదో కాలికి తగిలినట్టు చప్పున ఆగిపోతాను
ఆ బంధానికి అల్లుకు పోతాను

ఎప్పుడో విసిరిన రాయికి ఇప్పుడు అలలు కల్లోల పడతాయి
అలసిన తనువుకు తగిలిన పిల్ల తెమ్మెరకదా ఈ ప్రేమ
మోడులా బ్రతికేస్తుంటే చినుకు స్పర్శలా వచ్చి పలకరిస్తుంది

గుండెలో పేర్చిన గులకరాళ్ల గుట్టలో వెలుగేదో గోచరిస్తుంది
ఆ వెలుగును అన్వేషిస్తూ ఒక్కో రాయీ పెకిలిస్తాను
పిచ్చి భ్రమతో ఈ గుట్టను పేర్చాను
ఇప్పుడు అవేవీ పనికిరావని దేనికోసమో వెతుకుతున్నాను
నే వెతికే వెలుగే ప్రేమేతే అదే నాకు కావాలి
పరిపూర్ణంగా కావాలి

అందీ అందని అరా కొరా మధురానుభూతుల సారాంశం ప్రేమే అయితే
ఈ మధుర భావన ఆజన్మాంతం నిలిచేదెలా?
ఏమిటీ ప్రేమ? ఎక్కడ ప్రేమకు పరిపూర్ణత? ఎందుకీ ఎదకోత?

5, జూన్ 2010, శనివారం

నువు గుర్తుకు వచ్చినప్పుడల్లా



ఉప్పెనై వస్తావు ఊహలకేమీ మిగల్చక ఊడ్చుకెళతావు
అంతటా నీవే ఆవహిస్తావు ఆసాంతం ఆక్రమిస్తావు
గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెను గాయపరచి వెళుతుంటావు

అయినా నా పిచ్చి గానీ...
నీవు లేనిదెప్పుడనీ నా ఊహల్లో!?
వెలుపల వెలుగై కనిపించేదీ నువ్వే
అంతరాన ఆరని మంటైనదీ నువ్వే!

అంతగా ఆక్రమించావు నన్ను

అయినా అమాయకంగా అనుకుంటాను...
నిన్ను నా గుండె గదిలో బంధించేశానని...
ఇక బయటకు రాలేవని...
నా ఊహలకు అడ్డు రావని...

ఈ కుల మతాల కుట్రకు బలియై పోయాను
చుట్టూ ఉన్న ప్రపంచానికి భయపడి
పిరికి వాడిలా మిగిలిపోయాను నీదృష్టిలో...

పిచ్చి వాడినే కదా మరి..!?
నీ ప్రేమను అందుకో లేక పోయిన కుల పిచ్చివాడిని

అయినా ఏ మంత్రం వేశావో తెలియదు
నా మది తలపుల తలుపులు ఛేదించుకు వచ్చినప్పుడల్లా
నీ ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
ఉవ్వెత్తున ఎగసే అలలై కల్లోలం సృష్టిస్తాయి

లోకం దృష్టిలో నిన్ను కాదనుకున్నా
నా వరకు నెటికీ నీతోనే ఉంటున్నా
బహుశా అందుకేనెమో!?
ఎవ్వరికీ అందంకుండా నాలోనేనే ఒంటరిగా మిగిలిపోతున్నా

కులం గొప్పదా? ప్రేమ గొప్పదా? అన్న చిన్న ఆలోచనవచ్చి అది ఆవేశమై ఏదో రాశేశా...

4, జూన్ 2010, శుక్రవారం

వేదం - సినిమా




కాస్త లేటుగా లేచానా? లేచిన దగ్గరనుండీ మనసు ఓ తెగ గోల పెడుతొంది. వేదం సినిమా... అని. అటు గమ్యం డైరెక్టర్ క్రిష్ ఓ లెవెల్లో ఊహలు. ఇటు అల్లు అర్జున్, మనోజ్ మంచు , అనుష్క ఇపరీతంగా నటించేశారంట... మన సాగక ఫ్రెండ్స్ అందరికీ ఫోను మీద ఫోనుకొడితే ఒక్కడూ ఖాళీ లేడు. ఇంకేం చేస్తాం..!? ఆగిపోతామేటి? నేనొక్కడినే వెళ్లాను. వెళ్లే టప్పటికి హౌస్ ఫుల్. గంట ముందే వెళ్లా. కానీ ఏంలాభం? ఈ రోజు నాలుగాటలూ ఫుల్లే. ప్రక్కనే బ్లాకు టిక్కెట్లోడు ఫార్టీ... యైటీ...ఫార్టీ... యైటీ... అంటు ఊరించాడు.

ఈ మనసు మా చెడ్డది. సినిమా చూడకపోతే చూడలేదని గోల. బ్లాకులో చూస్తే బ్లాకెందుకని గోల, పైరసీ చూస్తే తప్పు చేస్తున్నావని గోల. చూసినా గోలే. చూడక పోయినా గోలే. ఏంచేసినా గోలే!? ఈ గోల తట్టుకోలేకే ఈ మధ్య బ్లాకు బందు చేశా! సరేలే ఇంకా గంట టైముంది కదా దగ్గరలో ఉన్న వేరే థియేటర్ కి వెల్దామని బయలుదేరి వెళ్లి పోయా! కానీ అక్కడ ఈ సినిమా ఆడటం లేదు. ఏంచేస్తాం ఇంటిముఖం పట్టా! దారిలోనే వేదం సినిమా థియేటర్. మళ్లీ క్రిష్... అనుష్క... వీళ్లందరూ గిర్రున తిరిగారు. ఓ ప్రక్కన బ్లాకు వద్దు ఇంటికి వెళ్లిపొమ్మని గోల. ఎహే... నీ గొలాపు! అని ఓ సారి విదిలించుకుని ఆవేశంగా వెళ్లి ఓ టిక్కెట్టు కొనేశా.

అప్పటికే సినిమా మొదలైపోయింది. రాక్ స్టార్ గా నటించిన మనోజ్ బాబు రాకింగ్ అక్కడ. సగం నుంచి చూడడంతో నా బుర్రకెక్కలే ఆ పాటేంటో! మనోజ్ అప్పుడే ఎదుగుతున్న ఓ రాక్ స్టార్ ( ఇంగ్లీషోళ్ల నగరపు ఈ దుల్లో గిటారట్టుకుని ఒళ్లు ఓ తెగ ఇరిచేసుకుంటూ పాటలు పాడుతుంటారే ఆళ్లన్నమాట ). అతనికి ఓ షో చెయ్యడానికి హైదరాబాదులో మంచి అవకాశం రావడంతో అక్కడికి బయలుదేరుతాడు.

రాజు (అల్లూ అర్జున్) ఓ కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేస్తుంటాడు. జూబ్లీ హిల్స్ స్లమ్ లో నివసించే అతనికి అదే జూబ్లీ హిల్స్ లో నివసించే రిచ్ గాల్ ఫ్రెండు ఉంటుంది. ఆమె దగ్గర బిల్డప్ కోసం తనను ఓ కోటీస్వరుడిగా పరిచయం చేసుకుని, డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతుంటాడు. జనవరి 1st పార్టీకి ఓ స్టార్ హోటల్ ఎంట్రీ టికెట్ తీసుకుంటానని గాల్ ఫ్రెండ్ కి మాటిచ్చిన రాజు ఆ టికెట్స్ కు డబ్బులకోసం నానా కష్టాలూ పడుతుంటాడు.

సరోజ ( అనుష్క ) అమలా పురంలో ఓ వేశ్యా వాటికలో పనిచేస్తుంటుంది. స్వతంత్రం గా తానే ఓ కంపెనీ నడపాలనుకుని హైదరాబాదుకు పారిపోయి వస్తుంది.

అలాగే ఓ చేనేత కుటుంబం, హైదరా బాదులో ఉండే ఓ ముస్లిం కుటుంబం ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తాయి. ఈ అయిదుగురు హైదరాబాదులో ఎలా కలుసుకున్నారు? అక్కడ వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అనేవి తెరమీద మీరు తెలుసుకో వలసిందే. అయిదుగిరి కథలను సీన్ బై సీన్ చూపిస్తూ ఆసక్తిగా తెరకెక్కించారు క్రిష్.

వేశ్యావాటికలో వేశ్యలు పాడిన ఓ చిన్న పాటలాంటి తత్వాలు బాగున్నాయి. ఓ సీన్ లో అనుష్కా "నీదగ్గర పడుకుంటానయ్యా! దాన్ని బతికించు" అంటూ డాక్టర్ ని వేడుకుంటుంది. నటించడానికి ఆ ఒక్క సీన్ చాలేమో అనుష్కాకి. కానీ అందుకోలేక పోయిందనిపించింది. నటనా పరంగా చూస్తే ఇంకాస్త మెరుగ్గా చేయవలసింది అనిపిస్తుంది ప్రతీ పాత్రా కూడా. కానీ కథ నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. ఆసాంతం ఆసక్తి కరంగా సాగుతుంది.

కథలో పాత్రలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతుంటాయి. బ్రతుకు చుట్టూ పెనవేసుకున్న ఎన్నో వెతలు, అవి చెప్పే కొన్ని కథలు సినిమా ఫక్కీ లో రసవత్తరంగా తీశారు. గమ్యం అంచనాలతో ఈ సినిమాకూడా చూడచ్చు. క్రిష్ లిస్ట్ లో మరో హిట్ వేశేసుకోవచ్చు. మీరూ చూడండి. బాగుంటుంది.

కథలో ఓ రధాన పాత్ర నన్ను ఆలో చింపచేసింది. మనం ఎదగ వలసింది మనిషిగా అని మరో సారి నిరూపించింది. మళ్లీ నా మనసు ఆలోచనల లోతుల్లో పడిపోయింది. అది చెప్తున్న వినకుండా బ్లాకులో వెళ్లా కదా!? ఈ సారి వెళ్ల కుండా మీ అందరిముందూ ఓ గట్టి నిర్ణయం తీసేసుకుంటున్నాను. " ఇక ఓ సంవత్సరం పాటు బ్లాకులో సినిమా చూడకూడదు. " నా ముందు టపా "మనసుని జయించడం ఎలా? " చదివారుకదా? నెల రోజులు, 2 నెలలూ టెస్ట్ పాసైపోయామన్నమాట. అందుకే ఓ సంవత్సరం అంటున్నాను. :)

సినిమా చూసి ఏడ్చేటోళ్లు కూడా ఉన్నారేటి? అందునా మొగ వాళ్లలో నేనొక్కడినే ఉంటానేమో అనుకున్నా! నాకీ రోజు మరొకడెవరో కళ్లుతుడుచుకుని బయటకు వస్తూ కనిపించాడు. నాన్నా బాబూ చిట్టీ.... టివ్ టివ్ టివ్ మ్...... :)

14, మే 2010, శుక్రవారం

మనసుని జయించటం ఎలా? - 3 నేటి యువతరానికి మీరు ఇవ్వవలసినది

మన మనసు ఎప్పుడొ ఒకప్పుడు మన మాట వింటోంది. కానీ కావాలనుకున్నప్పుడు, కావలసిన విషయంలో వినేటట్లు ఎలా చేయాలి?

ఒక్కొక్కరిని చూసినప్పుడు వీరికి మనో బలం ఎక్కువ అనుకుంటూ ఉంటాం. అంటే వారు అనుకున్న పని అనుకున్నట్టుగా చేసుకో గల సమర్ధత కలిగినవారు. మరొకరిని చూసి వీడి కసలు కుదురే లేదు. ఓ క్షణం ఆపని చేస్తాడు, మరో క్షణం ఈ పని చేస్తాడు. ఏదీ పూర్తిగా చెయ్యడు అనుకుంటాం. ఆ కుదురులేనిది అతనికి కాదు, అతని మనసుకి. ఇటువంటి కుదురు లేని మనసుని కుదుట పరచడం ఎలా?

ఎదిగే కుర్రవాడు సిగరెట్ తాగడం మొదలు పెట్టాడని తండ్రికి తెలిసింది. అప్పుడెలా ప్రవర్తించాలి? పిలిచి నాలుగు వాయించి నువ్వు సిగరట్ తాగడం మళ్లీ చూశానో తోలుతీస్తా అని చెప్పాడనుకోండి ఏమవుతుంది? త్రాగడం మానేస్తాడా? మానడు. దొంగతనంగా తాగుతాడు. పైగా తండ్రికి సిగరెట్ తాగే అలవాటు ఉండింది అనుకోండి, నాన్న తాగుతూ నన్ను తాగవద్దంటాడా? అని ఓ రకమైన పెంకి తనం అతనిలో పెరుగుతూ వచ్చి ఓ రోజు తండ్రి ఎదురుగా సిగరెట్ తాగే స్థితికి కూడా అతను రావచ్చు. కాబట్టి పిల్లవాడికి మానమని చెప్పాలంటే మనకు మానగల సమర్థత ఉండాలి. అసలు అంత దాకా రాకుండానే ఎప్పుడో మానేయాలి. పిల్లలు బాగు పడాలంటే మనకు కొన్ని నియమాలు తప్పవు. తమకోసం మానలేని ఎన్నో అలవాట్లను పిల్లల కోసమని మానేసిన వారుంటారు.

గాంధీజీ దగ్గరకు ఓ తల్లి పిల్లవాడిని తీసుకు వచ్చి, మహాత్మా మావాడు బెల్లంతింటున్నాడు. మీరు మానేయమని చెప్పండి, మీరు చెప్తే వింటాడు అని అడిగిందట. దానికి ఆయన ఓ 6 నెలలు ఆగి రమ్మని చెప్పారట. అలాగే 6 నెలల తరువాత పిల్లవాడిని తీసుకు వచ్చింది. అప్పుడు గాంధీజీ పిల్ల వానితో " బెల్లం ఎందుకు తుంటున్నావు నాన్నా!? అలా రోజూ తింటే జబ్బు చేస్తుంది. మన దేశానికి ఆరోగ్య వంతమైన ధృఢమైన యువత ఎంతో అవసరం. కనుక తినడం మానేయి" అని చెప్పారు. పిల్ల వాడు అలాగే మానేస్తాను అని చెప్పాడు. అప్పుడు తల్లి ఇదే మాట మీరు ఆరు నెలల క్రింద చెప్పి ఉండ వచ్చు కదా? మరి ఎందుకు చెప్పలేదు? అని అడిగింది. దానికి గాంధీజీ " నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. మానమని పిల్లవానికి చెప్పాలంటే నేను మాని చెప్పగలగాలి. అలా మానలేక పోతే నేను పాఠించని నియమం అతనిని పాఠించమని నేను చెప్పినా గౌరవం ఉండదు. నేను ఆచరించి చూపగలిగనాడే నామాటలకు విలువ కదా! అందుకే ఆ చిన్న మాట చెప్పడానికి నాకు 6 నెలలు పట్టింది " అని చెప్పారు.

మనలో నిజాయితీ విలువ ఎంతో మన మనసుకు తెలుసు. ఇది మనసుతో పని కనుక మరింత జాగ్రత్తగా మెలగాలి. మన బుద్ధి మంచి దైన నాడు మనసుకు మంచి చెప్ప వచ్చు. కనీసం చిన్న చిన్న నియమాలైనా జీవితంలో మీరు పాఠించి ఉంటే మీ మనసు మీ మాట వింటుంది.



మీకు బ్లాగులంటే చాలా ఇష్టం. బ్లాగులు చదువుతూ, కామెంట్లు రాస్తూ, కొత్త టపాలు రాస్తూ ఉన్నారు. అలా ఉంటే ఏ సమస్యా ఉండదు. కానీ ఉండరే! ఓ కొత్త టపా రాస్తారా!? రాసిన దగ్గరనుండీ ఒకటే ఉత్సుకత. ఈ పాటికి నా టపా ఎంతమంది చూశారో? దానికి ఎన్ని కామెంట్లు వచ్చాయో? అసలు ఎవరికైనా నచ్చిందో లేదో? ఇలా ఎన్ని ప్రశ్నలో . ఏంచేస్తాం ఇక రాసిన దగ్గరనుండీ కంప్యూటర్ ముందే కూచుని మాటి మాటికీ రీఫ్రేష్ నొక్కుకుని చూసుకుంటూ ఉంటాం. ఈ లోపు ఖాళీగా కూర్చోలేక కూడలికి వెళ్లి బ్లాగులన్నీ చుట్టి వస్తాం. కాలం గిర్రున తిరుగుంది. చూస్తూ చూస్తూ 4, 5 గంటలు గడిచిపోతాయి. ఆరోజు ఏదో చేయాలనుకున్న పని మర్చిపోతారు. గుర్తున్నా చేసే టైమ్ ఉండదు. ఈ తతంగం ఇంట్లో నెట్ ఉండి క్రొత్తగా బ్లాగు మొదలు పెట్టిన ఎవరికైనా అనుభంలోనిదే అయి ఉంటుంది.

రోజూ టీ త్రాగడం అలవాటు. రోజుకి 20 సార్లు త్రాగడం వ్యసనం. రోజూ బ్లాగులు చదవడం అలవాటు. రోజంతా బ్లాగులు చదవడం వ్యసనం. ఏదైనా ఒక పని అలవాటుగా ఉన్నంతకాలం ఏ సమస్యాలేదు. అదే పని వ్యసనంగా మారితే అది మంచి వ్యసనం కానివ్వండి, చెడు వ్యసనం కానివ్వండి దానిని నిరోధించ వలసిందే. లేదంటే మన మనసు దారితప్పుతున్నట్టే.

రోజూ చూసే ఓ అమ్మాయిని ప్రేమిస్తూ మానసులోనే ఊహలెన్నో చేసుకుంటూ ఉన్నారనుకోండి అది మనసుకి ఓ కొత్త అలవాటు. అదే పరిపాటి అయితే అదో వ్యసనం. అను క్షణం ఆమే గుర్తుకు వస్తుంది. మనసు ఏవేవో కలలు కంటుంది. ఏపనీ చేయ బుద్ధికాదు. నిద్రకూడా పట్టదు. ( వ్యసనం ఏదైనా ఇవన్నీ సహజ లక్షణాలు. కాకపోతే ప్రేమలో వీటి తీవ్రత ఎక్కువ ) చివరికి మనసుని అదుపు చేయలేక ఆమెకి మీ ప్రేమని చెప్పేస్తారు. ఆమెకు కూడా ఇష్టమైతే మీ అదృష్టం పుచ్చి నట్టే. కానీ కాదంటే మీ పరిస్థితి ఏమిటి? మీ మనసు ఆ అపజయాన్ని జీర్ణించుకోలేదు. ఆమెను ఊహించ కుండా ఉండలేదు. క్షణ క్షణం కళ్లముందు నరకం కనిపిస్తుంది. ఆమెను చూసిన ప్రతి సారి మనసు రంపపు కోతకు గురి అవుతుంది. ఈ స్థిని దాటే సత్తా నేటి తరానికి ఉందా. ఇటువంటి స్థితే కదా నేడు మనం రోజూ వింటున్న, కంటున్న ఆత్మ హత్యలకు, యాసిడ్ దాడులకు కారణం. ఆమెను గురించి ఆలోచించకుండా ఉండలేరు. అలా అని గుర్తుకు వచ్చిన ప్రతిసారీ కలిగే వేదనను భరించలేరు.

ఈ స్థితి నుండి బయట పడే మార్గం ఉందా? ఉంది కానీ అది మీరు తెలుసుకోలేరు. ఎందుకో తెలుసా? ఆనాడు టీ మంచిదే కదా అనుకుని అది వ్యసనంగా మారినా చూస్తూ ఊరుకున్నారు కనుక. కంప్యూటర్ వాడడం నిగ్రహించడానికి ఏనాడూ ప్రయత్నించ లేదు కనుక. మీకు అంతకుముందు దేనినీ అదుపు చేసుకున్న అలవాటు, అనుభవమూ లేదు కనుక.

అలాకాక మీరు నా నెట్ బ్రౌజింగ్ ( లేదా ఏదైనా అలవాటు ) వ్యసనంగా మారింది. దానివల్ల నా విలువైన కాలం వృధా అవుతోంది. నేను దీనిని అదుపులొ ఉంచుకోవాలి అనుకున్నారనుకోండి పరిస్థితి మరోలా ఉంటుంది.

నేను ఓ సంవత్సరమంతా నెట్ కి దూరంగా ఉంటాను అనుకున్నారనుకోండి ఉండగలరా? ఉండలేరు 3 రోజుల్లో నే మళ్లీ మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే మీ సంకల్పం మీకే అసమంజసంగా అనిపిస్తుంది. అదే ఓ నెలంతా నేను నెట్ ముట్టు కోను అనుకుంటే అది కొంత నయం. దానికంటే ఓ వారం అనుకోవడం మేలు. అదే ఓ రోజు అనుకున్నరనుకోండి మీరు గెలుపు దారిలో పడినట్టే. " చిన్న ఆరంభాలె పెద్ద పనులను సాధింపచేస్తాయి ". అది నిజం. ఒక రోజు మీరు నెట్ కి దూరంగా ఉండడం సులువైన పనే. ఓ విధంగా చాలా సులువైన పని. కనుకు దానికి మనసు పెద్ద గొడవ చేయదు. మీమాట వింటుంది. అలా నెట్ కు దూరంగా ఉండడం వల్ల కలిసొచ్చిన సమయాన్ని ఓ మంచి అలవాటుకు పునాది వేయడానికి వినియోగించండి. అలా రెండు మూడు సార్లు అయిన తరువాత రోజు నుండి మీ నియమాన్ని ఓ 3 రోజులకి పెంచండి. తరువాత వారం, తరువాత ఓ నెల, రెండు నెలలు అలా అలా...( నేను మొన్నీ మధ్యనే ఓ 4 నెలలు పూర్తిచేసుకున్నట్టున్నాను. ) అయితే ఎక్కడా తొందర ఉండకూడదు. నెమ్మదిగా లక్ష్యాన్ని పెంచుకోవాలి. ఆ సమయం విలువెంతో మనం చేసుకున్న మరో మంచి అలవాటు చెబుతుంది. లక్ష్యం పెరిగే కొద్దీ మనమీద మనకున్న నమ్మకం పెరుగుతుంది. ఆ మనో బలమే ఇతరులకు కష్ట తరమైన పనులను సైతం మనకు సుసాధ్యం చేస్తుంది. మన పెద్దలు పాఠించే ఉపవాసాలు, నియమాలు, అయ్యప్ప స్వామి దీక్ష మొదలైనవాటి అంతరార్థం మన మనో బలాన్ని పెంచడమే అనిపిస్తుంది.

ఇలా పెరిగిన మనో బలమే మనకు ఎదురైన పెద్దపెద్ద కష్టాలను సైతం ఎదిరించి ముందుకు నడచేలా చేస్తుంది. ఈ మనో బలం లేకే కదా నేటి యువతరం ( విద్యార్థులు, ప్రేమికులు ) ఆత్మహత్యలు చేసుకునేది. కాబట్టి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే మనం ఇవ్వవలసింది మంచి చదువులు, కూడ బెట్టిన ఆస్థులు కాదు. మనో బలం కావాలి వారికి. ముందరి తరాల వారికీ , నేటి తరానికీ తేడా అక్కడే. చిన్న దానికే అతిగా స్పందిచే నేటి తరానికి నియమంగా ఉండడం వల్ల లాభామేమిటో మనం వివరంగా చెప్పగలగాలి. మనసు మాట వింటూ పోతే మనం ఎంత పతనమవుతామో వివరించాలి. దాని శక్తిని తెలిపి, ఆ శక్తిని ఓ ఆయుధంగా మలచే యుక్తి నేర్పాలి. అదే వారి బంగారు భవితకు బాటలు వేస్తుంది.


మంచి దైనా, చెడు దైనా వ్యసనం వ్యసనమే. అది మనను నిప్పులా దహించక మానదు. కాబట్టి అలవాటు వ్యసనంగా మారే చిన్న గీతను గుర్తించి ముందు గానే జాగ్రత్త పడడం అన్నివిధాలా శ్రేయస్కరం. ముందు మనం చేయగల చిన్న పనులను నిర్ణయించుకోవాలి. చిన్న చిన్న నియమాలే పెద్ద లక్ష్యాలకు సోపానాలు. మనం పెట్టుకున్న నియమాలే మనకు శ్రీరామ రక్ష.