About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

2, మే 2010, ఆదివారం

మనసుని జయించటం ఎలా?-1 మనో యుద్ధం


మనసు చాలా చిత్రమైనది. ఏదో కావలంటుంది. అది ఇవ్వబోతే తానే వద్దంటుంది. ఎన్ని కోరికలు తీర్చినా మళ్లీ మళ్లీ కోరుతుంది. కంటికి కనిపించని మనసు మన ప్రతి పనిలోనూ తన ఉనికిని తెలుపుతూ ఉంటుంది. ఓరోజు ఇంటికి త్వరగా రావాలని గట్టిగా అనుకుంటానా.. అదేరోజు బయలుదేరి వస్తుంటే ఏదో మాయ చేసి నన్ను దారిలోనే ఆగి ఆలస్యం చేసే టట్లు చేస్తుంది. ఏమిటీ మనసు? ఎక్కడుంది తాను? నామీద తనకెక్కడిదీ అధికారం? అని నేను దాన్ని వ్యతిరేకిస్తే ప్రపంచమే తలక్రిందులు చేస్తుంది. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వదు, నిల్చోనివ్వదు, నా పని చేసుకోనివ్వదు.
సిగరెట్ మానేద్దామని బలంగా సంకల్పించుకుంటారా!? మరు క్షణమే మనసు లాగేస్తుం. పెదాలు తహ తహ లాడుతాయి. ఓ యుద్ధం మొదలవుతుంది. వద్దు అని ఏదో అంటుంది. ఎందుకు వద్దు అని మరోటి ప్రశ్నిస్తుంది. ఇక ప్రశ్నలు సమాధానాలు ఎక్కడి వరకూ వెళ్తాయో... అక్కడా ఇక్కడా తిరిగి ఎన్ని సమాధానాలు చెప్పి శాంత పరిచినా మళ్లీ అది కావాలంటుంది. జివ్వున లాగేస్తుంది. మళ్లీ యుద్ధం. ఈ సారి అంత ఓపిక ఉండదు. వాద ప్రతివాదాలు విన్న తరువాత కూడా మళ్లీ అడుగదనేంటి? ఛా.. ఈ బ్రతుకింతే తాగేస్తే ఈ గొడవంతా ఉండదు. క్షణ క్షణం సమాధానం చెప్పుకోలేక నరకం చూసే కన్నా సిగరెట్ తాగడమే బెటర్ అని తాగేస్తారు.

ఇలా మనసు సిగరెట్,మందు, శృంగారం,జూదం,డబ్బు ఒకటేమిటి చివరికి కాఫీ,టీ ల విషయం లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఒకడికి ఐస్ క్రీం విషయంలో యుద్ధం జరగచ్చు, మరొకడికి ఉప్పూ,కారాల విషయంలో జరగవచ్చు, వేరొకడికి కంప్యూటర్ విషయంలో జరగవచ్చు. అది కావాలన్నది మనం వద్దంటే ఏదో ఒక విషయంలో మనకి మనసుతో ఈ యుద్ధం తప్పదు. ఆ యుద్ధంలో జయించే వారు చాలా తక్కువ. కానీ జయించిన వారు మన మధ్యలోనే ఉంటారు. వారిని గుర్తించ గలిగితే మనకు కొంత విజయం లభించినట్లే.

మరి అటువంటి యుద్ధ గాధలు మీకు తెలిసినవి వ్యాఖ్యలుగా రాస్తారు కదూ. మీ జీవితంలో జరిగినవే కావచ్చు, మీకు తెలిసిన వారివే కావచ్చు ఏ వైనా మరొకరికి స్ఫూర్తినిస్తాయని గుర్తుంచు కోండి. అపజయాలు చర్చించడం కూడా చాలా అవసరం.

మనసుని జయించటం ఎలా? మిగతాది వేరొకటపాలో...

16 వ్యాఖ్యలు:

 1. మహాభారత యుద్ధంలో కృష్ణుడిని అర్జునుడు ఇలానే అడుగుతాడు.

  ఎవరికి వారు మనసుని బుజ్జగించి,లాలించి సాధనతో దారికి తెచ్చుకోవాల్సిందే కాని వేరే దారి లేదని చెపుతారు.

  మనకు ఇష్టం లేనిదే ఎపుడూ ఎదురౌతుంది,ఏం చేస్తాం? మనసుకి సర్ది చెప్పుకోవడం తప్ప.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మనకి ఇష్టంలేనిది అంటే అది మనసుకా? మనకా? అసలు మనసు, మనం వేరే వేరా?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మనసు,మనం వేరు వేరు కాదు.
  మన మనసుకి ఇష్టం లేనిదే ఎపుడూ ఎదురౌతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మనో బుద్ధి చిత్త అహంకారములని 4 ఉంటాయి. వీటికన్నింటి కంటే వేరైనది మనం. అవి వేరు మనం వేరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సాధన ద్వారా మనస్సుని జయించవచ్చు మొదటిలో ఎదురు తిరుగుతుంది ...కాని మనం చేస్తున్న ఆ పని ద్వారా పొందే ఆనందాన్ని పదే పదే మనో విశ్లేషణ చేయడం దానిని అధిగమించవచ్చు...ధ్యానం సులభమైన మార్గం .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. వెల్కం బాక్. దేనికైనా మనసేగా కారణం. మనసులేని బ్రతుకొక నరకం అన్నారుగా. ఏ సాధనకైనా మనోనిగ్రత ముఖ్యం. సాధనమున పనులు సమకూరు ధరలోన. పట్టుదల కావాలి. అరిష్డ్వర్గాలని జయించవచ్చు. Try & try again. This is what I do.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అజ్ఞాత గారు : అవును నేను కూడా మనసు వేరు, బుద్ధి వేరు అని నమ్ముతాను. ఇవేవీ నేను కాదని కూడా నాకు నమ్మకం.

  చిన్ని గారు : సాధన ద్వారా అది సాధ్యపడుతుంది అనేది నిజం. కానీ ఆ సాధన ఏమిటి? ఎలాంటిది అనేదే విపులంగా చర్చించాలని ఏదో మొదలు పెట్టా. ఈలోపులొ వ్యాఖ్యలు కూడా కొంత చర్చిస్తాయి కదా అని కొంత సమయమూ ఇచ్చాను. :)


  జయ గారు : ధన్యవాదాలు. అలా ఒక్కమాటలో చెప్పేస్తే ఎలా గండీ... మీ కాలేజీలో పిల్లలెవరైనా మనసుని జయించిన సందర్భాల వంటివి కాస్త ఉదహరిస్తే బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. సాధన గురించి ఏం చెప్పబోతున్నారు?
  తెలుసుకోవాలని ఎదురుచూస్తూ ఉంటాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. చాలా సంవత్సరాల క్రిందట వంటరిగా ఉంటున్నప్పుడు సాయంత్రం బార్ కెళ్ళి డ్రింక్ తీసుకోవటం మొదలుపెట్టాను.
  కారణం అంటూ ఏమీ లేదు. ఉబుసు పోక. కొన్ని రోజుల తరవాత సాయంత్రం మనస్సు అక్కడికి వెళ్ళు అనే ఆలోచన మొదలు పెట్టసాగింది. వెంటనే ఇది వ్యసనం లాగా మారుతోంది అని గట్టిగా వారం రోజులు ఆపుకున్నాను బార్ కి వెళ్ళకుండా. దాని తోటి అక్కడకి తప్పకుండా వెళ్ళాలి అనే మనో వ్యధ పోయింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @ మందాకిని గారు: అయ్యబాబోయ్ నేనేమీ చెప్పలేక పోతే మీరు నిరాశ చెందుతారేమో... ప్రయత్నం మాత్రమే చేస్తాను. మనసులో అయితే ఉంది అది పేపరు మీదకి వచ్చేసరికి ఎలా వస్తుందో చూడాలి. :)

  @ రావు గారు: నమస్కారమండీ. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ప్రారంభించిన కొన్ని రొజులకే దాన్ని వద్దని ప్రతిఘటించారు కాబట్టి మీకు కొంతలో కొంత లొంగింది. అదే చాలా రోజుల అలవాటు తరువాత అయితే మీరు చాలా కష్టపడాల్సి వచ్చేది.మీ మనసుపై మీకు కలిగిన ఓ పెద్ద విజయం అని చెప్పాలి. నేటి తరం వారికి ఆ విజయ రహస్యం తెలియడం లేదు. అందుకనే అనేక సమస్యలు, చిన్న వాటికే అతిగా స్పందించడాలు, ఆత్మ హత్యలు మొదలైనవి. మీ వంటీ వారి విజయాలు వింటేనయినా మాపై మాకు నమ్మకం పెరుగుతుందని ఓ చిన్ని ఆశ. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నిజమే మనసు బుద్ది ఈ రెండు పెట్టే కష్టాలు అన్ని ఇన్ని కావు, మనము చెస్తున్నది తప్పని తెలిసీ కొన్ని సార్లు మనల్న్ని మనం అదుపు పెట్టుకొలేము, తర్వాత బాధ పడేది మనమే.సందర్భం కాకపోయినా ఈ పాట గుర్తు వస్తొంది.
  కోరికలు కోరేది మనసు
  అవి తీరకుంటె క్రుంగేది మనసు
  అల లాగ చెలరేగు మనసు
  తుదకు శిల లాగ మారేది మనసు

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మనసు ఒకటి చెప్తుంది. బుద్ధి ఇంకొకటి చెప్తుంది, బుద్ధి కరక్ట్ గా చెప్తుంది. కాని మనసే గెలుస్తుంది. దాన్ని అధిగమించాలంటే యోగా ఒకటే మార్గం.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. చిన్న చిన్న విషయాలలో కూడా ముందు వెనుకలకు లాగుతుంటుంది మనసు... దాన్ని అదుపులో పెట్టుకోవాలనే మాట చాల సార్లు విన్నాను. నాకెందుకో ఆ మాట నచ్చదు... మనం చేసే మంచి చెడుల గురించి అంతర్చర్చ .. ఎప్పుడూ జరుగుతుంటుంది... కొందరికి ఆ గోలే లేదు (వాళ్ళ గురించి నేనేమీ చెప్పట్లేదు.... కూడా) ఎంత కాలం ఈ చర్చ జరుగుతోందో.. ఫలితం మంచి వైపు నడుస్తోందో.. మన అంత చక్షువులు మరింత వెలుగును చూస్తున్నట్టు.. మన చర్యల పై మనకు పట్టు వస్తున్నట్టు.. అదుపు కావలసింది. మన పనులపై.. ఆలోచనల పై.. కాని.. మనసు పై కాదు.. పైన ఎవరో చెప్పినట్టు.. మనసు, మనం వేరు వేరు కాదు... అయినా ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తే.. కొంప కొల్లేరే... కావలసింది.. సరైన అనుసంధానం..అంతే..

  శివ చెరువు..

  ప్రత్యుత్తరంతొలగించు
 14. "మనసు వేరు, బుద్ధి వేరు అని నమ్ముతాను. ఇవేవీ నేను కాదని కూడా నాకు నమ్మకం."

  అవునండి. మనసు వేరు. బుద్ధి వేరు. నేను అంటే ప్రాణశక్తి లేదా ఆత్మ. నా ఉనికి నా ఆత్మే (ప్రాణశక్తి). ప్రాణశక్తి శరీరంలో ఉన్నంతవరకే మనసుకైన, బుద్ధికైనా ఉనికి. మనసుకి భావన అనే స్థితి, బుద్ధికి విచక్షణ అనే స్థితి ఉంటాయి. అంటే మనసు ఏదైనా కోరుకుంటుంది. బుద్ధి ఆ కోరిక సరైయినదా కాదా అని తప్పొప్పుల బేరిజు వేస్తుంది.
  మనసు కోరుకున్నట్టల్లా ఆడకుండా, బుద్ధి యొక్క విచక్షణని ఉపయోగించి తన ప్రాణశక్తి ద్వారా మనిషి ఒక పనిని చేయగలిగితే మనసు కంట్రోల్ లో ఉన్నట్టే. అలాకాక కేవలం మనసుని మాత్రమే అనుసరించి, బుద్ధి ని వదిలేస్తే ఆ పని ఒప్పవ్వచ్చు, తప్పవ్వచ్చు. అంటే మనిషి పూర్తిగా మనసుకి లొంగిపోతాడన్నమాట. ఈ మనస్సు, బుద్ధి, ప్రాణశక్తి ల అనుసంధానమే యోగా. ఇది పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగా విధానము. సవ్వడి గారు చెప్పినట్టు అష్టాంగ యోగా సాధన ద్వారా మనసుని జయించవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. వెంకట్ గారు : సందర్భం ఎందుకు కాదు. మంచి సందర్భంలో మంచి పాట గుర్తు చేసారు. :)

  సవ్వడి గారు : వ్యసనం బాగా ముదిరిన స్థితిలో ఉన్న వారు యోగా దాకా వెళ్లడం కాస్త కష్టం. దానికి ముందుగా మనం చేయవలసినవి వెతుకుదామని ఈ ప్రయత్నం.

  శిశిర గారు : మీకు యోగాకు సంబంధించి ఇన్ని విషయలు తెలుసా!? జోహార్లు.

  మీరన్న యమము,నియమము,ఆసనము,ప్రాణాయామము,ప్రత్యాహారము,ధ్యానము,ధారణము,సమధి అన్న 8 అంగములతో కూడుకున్న పతంజలి యొక్క యోగమును అభ్యసిస్తే మనసు మనం చెప్పినట్లు వింటుంది. కానీ అంత మంచి ఆలోచన ఉన్నవాళ్ల్ల్ల్లు అసలు వ్యసనాల జోలికే వెళ్లరు. వెళ్లినా లక్కరాజు రావు గారిలాగ ఎప్పుడో వాటిని అదుపులోకి తెచ్చుకునేవారు.

  కాబట్టి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అని వెతుకుతున్నాను.

  ఇంకో విషయము మనసుని నిగ్రహించుకోవడమంటే నియమంగా ఉండడమే కదా. అంటే అష్టాంగ మార్గ యోగములో నియమము అన్నది ఒక భాగమేకదా!? కనుక మనకు తెలియకుండానే నియమాలను పాఠిస్తున్నాము. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. శివ చెరువు గారు: ఈ క్రింది రెండు చూడండి.

  " అదుపులో పెట్టుకోవాలనే మాట చాల సార్లు విన్నాను. నాకెందుకో ఆ మాట నచ్చదు "

  " ఎంత కాలం ఈ చర్చ జరుగుతోందో.. ఫలితం మంచి వైపు నడుస్తోందో.. మన అంత చక్షువులు మరింత వెలుగును చూస్తున్నట్టు.. మన చర్యల పై మనకు పట్టు వస్తున్నట్టు "

  అంటే మనం మన చేతలను అదుపు చేసుకో గలుగుతున్నట్టే కదా?

  మరి మీరే అదుపు ఇష్టం లెదంటున్నారు. మళ్లీ పట్టు సాధించ గలమంటున్నారు.

  " అదుపు కావలసింది. మన పనులపై.. ఆలోచనల పై.. కాని.. మనసు పై కాదు.."

  మన మనసు సహకరిస్తేనే మన పనులు సరిగా ఉంటాయని నా అభిప్రాయం.

  " మనసు, మనం వేరు వేరు కాదు "
  ఇది నేనొప్పుకోలేను. అఙ్ఞాత గారు, శిశిర గారు చెప్పిన వాటితో నేను ఏకీభవిస్తాను.


  " అయినా ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తే.. కొంప కొల్లేరే... కావలసింది.. సరైన అనుసంధానం..అంతే.. "

  ఈ మాట మాత్రం చాలా చక్కగా చెప్పారు. మన్నించండి మీసమాధానం నాకు కాస్త గజిబిజిగా అనిపిస్తోంది. ఒక్కసారి పునరవలోకించి కాస్త వివరంగా రాయగలరా.


  మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు