About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

14, ఆగస్టు 2010, శనివారం

పరవశం

ఎగసే అల అయినా తిరిగి భూమిని తాకుతుంది. రగిలే జ్వాలైనా ఏదోనాటికి శాంత పడుతుంది.ఉదయించే సూర్యుడు కూడా సాయంసంధ్యకు మాయమవుతాడు. చంద్రుని వెన్నెల చీకటి ఉన్నంతవరకే! చిత్రంగా నాలో ఉదయించిన ప్రేమ మాత్రం అంతకంతకు అనంతమౌతున్నది.

ఏనాడు పడిన బీజమో ఇది. అమ్మ చేతి గోరు ముద్దల నాటిదేమో! గోటి బిళ్లల ఆటల తోటి దేమో! అంకురానికి మూలమేమిటని అడిగితే ఏమి చెప్పగలను? అమాయకపు నవ్వు తప్ప.! అందుకు కారణం నీవని తెలుసు. ఆనాటికే ఎవరు చెప్పారు నీ ఎరుక!? పరమేశునికే ఎరుక! :)

మేడపైన ఒంటరిగా కూర్చున్నప్పుడు పలకరించే పిల్లగాలి పరిచయమేగా..!? నీలాకాశంలో నల్లని కొంగల బారును చూశావా నీవెపుడైనా? పచ్చటి ప్రకృతి ఒడిలోకి జారే ఎఱ్ఱటి పసిపాపడినెరుగుదువా!? చిరు చినుకులు పడుతున్నప్పుడు దారి ప్రక్కన బండి వాడి వేడివేడి జిలేబీల రుచీ..!? వీటన్నిటికంటే తీయనైనది నా అనుభూతి.

నీ ఊహల్లో ఒంటరిగా నాలో నేనే నవ్వేస్తూ దారంట పోతుంటే... దూరంగా కొండపై మ్రోగే గుడిగంటలు, కేరింతలు కొడుతూ పరిగిడుతున్న స్కూలు పిల్లలు, చెంగు చెంగున ఎగిరే తువ్వాయి తుంటరి చేష్టలు, ఆకలి తీరిందన్న సంతోషంలో అవ్వ ఇచ్చిన బోసినవ్వులు, గూటికి చేరే గోరువంకలు... ఒక్కటేమిటి అన్నీ నువ్వే... అన్నిటా నీవు నింపిన ప్రేమే... అంతగా ఆక్రమించావు నన్ను!

అయినా నీవెవరో తెలియదు నేటికీ. నీరూపం అసలె తెలియదు. ఇనాళ్లూ ఎలాగడిచాయన్న ఎఱుకే లేదు. అన్ని కాలాలూ వంసతాన్నే తలపిస్తున్నాయి నీ ఊ హలతో... స్నేహితులు నర్మగర్భంగా నవ్వుతున్నారు నాకో సహచరి కావలెనని. పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు. నీ వస్తావన్న ఊహే నా ప్రేమకు ఊపిరులూదుతున్నది. ఏ నాటికి నీ కాటుక కనులలో నా రూపు నిలిచేనో!? తొలి ముద్దు తీపి తెలిసేనో...!? ఆ ఊహకే ఇంతటి పరవశమైతే.., నీవే ఎదురైన క్షణాన, కనులు కనులతో పలకరించిన నిమిషాన అమరుడినై పోతానేమో..!


మా పెరటి తోటలో గడ్డి పూలను పరచి, మల్లె తీగను పందిరి వేసి, పండువెన్నెలను దీపం చేసి, పిల్ల గాలులను వింజామరలు చేసి నీ రాకకై వేచి ఉంటిని. పరుగున రావే నా నా ప్రణయ దేవతగా.!

9 వ్యాఖ్యలు:

 1. అయ్యబాబోయ్! ఎంత అందమైన భావనలు!
  ఆ బంగారు బొమ్మకు అభినందనలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా బాగుంది. మందాకిని గారి మాటలే నావీనూ. ఆ బంగారు బొమ్మకు అభినందనలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అందమైన మీ బృందావనంలో విహరించ వచ్చే మీ వయ్యారి, మురిపాల, సరాగాల, వగలమారి రాధమ్మ ను మేము కూడా పరిమళించె సోయగాల విరిబాలలతో మీ వెన్నెల వేదిక పైకి ఆహ్వానించమా!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా చాలా బాగుంది ......
  >>చిత్రంగా నాలో ఉదయించిన ప్రేమ మాత్రం అంతకంతకు అనంతమౌతున్నది.
  ..ఇలా అనంతమైన ప్రేమే మిమ్మల్నివిశ్వ ప్రేమికుడిని చేసిందా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @విజయమోహన్ గారు: ధన్యవాదాలండీ... :)
  @మందాకిని గారు: అయ్యబాబోయ్... మీ అభినందనలు చేరవేయడానికి కొంత టైం పడుతుంది. అప్పటి దాకా ఆగాలి మరి :)
  @చిన్ని గారు: thank you.. :)
  @శిశిర గారు : ధన్యవాదాలు.
  @జయ గారు: త్వరగా త్వరగా... :)
  @వంశీ గారు: చేసిందో లేదో మీరే చెప్పాలి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. హయ్యో ! గారు ఎందుకు మధ్య లో అడ్డం....తీసెయ్ మిత్రమా ఆ తోక ఇక

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇంత అందంగా, అద్భుతంగా పిలిస్తే ఎందుకు రాదండీ!

  ప్రత్యుత్తరంతొలగించు