About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

19, ఆగస్టు 2009, బుధవారం

ప్రేమను గెలవటం అంత కష్టమా..?

ప్రేమంటే సులువు కాదురా... అదినీవు గెలవలేవురా ... ప్రేమించే షరతులేమిటో... అందులోని మర్మమేమిటో... ఖుషి సినిమా లోని పాటంటే నాకు చాలా ఇష్టం. పాట విన్నప్పుడల్లా ఇదే ప్రశ్న నన్ను నేను పదే పదే వేసుకుంటూ ఉంటాను. ప్రేమంటే అంత కష్టమా? దాన్ని గెలవడం మరింత కష్టమా? అని. అది గెలుచుకో లేకే కదా ఈ మధ్య ప్రేమికులు వెర్రి పోకడలు పోతున్నారు. ఎంతో మంది అమ్మాయిలూ, అబ్బాయిలు బలైపోతున్నారు.

సరే చిన్న వాళ్లను వదిలెస్తే పెద్ద వాళ్లకు కూడా ఆ ప్రేమను పొందట మెట్లాగో తెలియటం లేదు. అదే తెలిస్తే మన
ఇండియాలో వృద్ధాశ్రమాలు ఉండేవి కాదేమో ...? అసలు ప్రేమను రుచి చూపిస్తే కదా నేటి యువతకు దాని విలువ తెలిసేది.

కాలం మారింది. దేని ప్రభావంవల్ల నైతే నేమి ఇప్పుడు స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలు చేసుకోవలసిన స్థితి. " అందరూ ఎదిగి పోతున్నారు. మనం మత్రం ఇలాగే ఉండిపోతే ఎలా? చన్నీళ్లకి వేన్నీళ్లు తోడు, ఇద్దరం ఉద్యోగం చేసుకుంటే పిల్లలు సుఖంగా ఉంటారు. " ఇదీ నేటి మధ్య తరగతి దంపతుల ఆలోచన. పోనీ ఆర్ధికంగా బాగున్న వారేమన్నా ఒకళ్లు ఇంట్లో ఉంటారా అంటే లేదు. వాళ్లూ ఎదగాలి. వాళ్ల లక్ష్యాలు వాళ్లకుంటాయి.

దీనివల్ల వచ్చే అనర్ధమేమిటీ...? చాలా మందికి ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ ఈ జెట్ స్పీడ్ జీవితంలో ఆలోచించడం మానేసి చాలా కాలమౌతోంది. అంత సమయం లెదు చాలా మందికి.

నాకు తెలిసిన ఒక దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులవడం వల్ల, పిల్లలని వాళ్లు వచ్చే వరకూ దగ్గరలో ఉన్న అమ్మమ్మ గారి ఇంట్లో ఉండమనే వారు. కొంతమంది పిల్లలకు ఈ అవకాశం కూడా లేదు. సరే వీళ్ల పిల్లలకు ఉంది, కానీ ఒకరోజు ఆ తల్లికి తెలిసింది తన కూతురిని మేనమామ శారీరకంగా హింసిస్తున్నాడని. ఇటువంటివి తెలిసినప్పుడు చాలా బాధనిపిస్తుంది.

ఆ రెండు కుటుంబాల వాళ్లు విద్యా బుద్ధులు లేని వారు కాదు. చాలా చదువుకున్న కుటుంబాలవి. ఆ తల్లి కల్లో కూడా ఇటువంటి స్థితి ఆలోచించి ఉండదు. కానీ ఇది తెలిసి ఎంత కుమిలిపోయి ఉంటుందో? చివరికి ఆమె ఉద్యోగం మానేసింది. ఇక్కడ చాలా మంది వాదిస్తారు ఎందుకు ఆడవాళ్లే ఇంట్లో ఉండాలని. ఇక్కడ ఆడవాళ్లు ఉద్యోగం మానాలా? లేక మొగవాళ్లా? అన్నది కాదు ప్రశ్న. ఎదిగే వయసులో పిల్లలకు పెద్దల సాన్నిహిత్యం ఎంత అవసరం అన్నది ప్రశ్న. ఆ వయసులోనే వారికి వ్యక్తిత్వానికి కావలసిన పునాది పడాలి. నేర్పవలసిన విలువలు నేర్పుతున్నామా అన్నది ఆలోచించాలి . అటువంటి విలువలు నేర్పక పోవడం వల్లే కదా ఆ మేనమామ అలాంటి పని చేశాడు.


ఈ ఎదుగు దల అన్నది ఆర్దికంగా ఉంటే సరిపోతుందా? నైతిక ఎదుగుదల అవసరంలేదా? చిన్నప్పటి నుండే స్లీవ్ లెస్ వేసుకోవడం నేర్పిన తల్లి, పెద్దయ్యాకా చీరలు కట్టమంటే కూతురు ఎంతవరకూ వింటుంది? కొడుకు అడిగినదల్లా ఇచ్చే తండ్రి, అతన్ని ఎంత సమర్ధవంతంగా పెంచగలడు? నేటి యువత అంత మానసిక బలహీనులుగా తయారవడానికి పెద్దల తప్పు ఎంతవరకూ ఉంది?

నేడు ప్రేమలు ఎలాఉన్నాయి? ప్రేమంటే ఏదో ఆటగా భావిస్తున్నారు. మోగా, ఆడా తేడా లేకుండా ప్రేమ పేరుతొ విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. నేటి ఇంటర్, డిగ్రీ స్థాయి విద్యార్ధులకు ఒక్కళ్ళ తోనే తిరగాలనే నియమం కూడా లేదు. వీళ్ళు కాక పొతే వాళ్ళు. నిజానికి అలా అనుకుంటేనే బ్రతుక గలుగు తున్నారేమో అనిపిస్తుంది కొందరిని చుస్తే . కొంతమంది ఒక్కరినే ప్రేమించాలి అనుకునే వారున్నా ప్రేమలు విఫల మైతే తట్టుకో గల మానసిక బలం లేదు వీరికి. ఉంటే అలా, లేక పొతే ఇలా. రెండు ప్రమాదమే. రెండో రకం వారు ఆత్మహత్యలు, లేదా హత్యలు చేయడానికి పూనుకొంటున్నారు. ప్రాణాలతో ఆటలాడుతున్నారు.


అమ్మాయి చెప్పింది అన్నయ్యా మా కాలేజీలో వర్జిన్స్ ని చేతివేళ్లపై లెక్కపెట్టి చెప్పవచ్చు అంది. ఇది నమ్మశక్యంగా లేకున్నా నేటి నిజం అదే. మరి మన పెద్దలకు ఈ విషయాలు జీర్ణమవుతాయా? కావు. అందరూ అలా ఉన్నారని కాదు. ఎంతో మంచి వారూ ఉన్నారు. కానీ పరిస్థితులు మొత్తం మారి పొతున్నయి.

ఈ స్థితిలో పెద్దలు పిల్లలకు బాగా దగ్గరవ్వాలి. స్నేహితులుగా మసలుకుంటూ మంచి మార్గంలో నడిపించాలి. చదువులతో పాటు, వారి వ్యక్తిత్వ వికాసానికి పాటు పడాలి. యవత కూడా ఆలోచిం వలసిన విషయం ఇది.
ప్రేమలు తప్పు కాదు. ప్రాణాల మీదకు తెచ్చే ప్రేమలు ఒప్పుకాదు. ఆలోచించి అడుగువేయాలి. మన మనసు అదుపు తప్పెంత స్థితి వచ్చే వరకు ప్రేమను వ్యక్త పరచకుండా ఉండడం అంత మంచిది కాదు. అసలు ప్రేమ లేకుండా ఉడడమూ నేటి యువతకు సరి కాదు.


ప్రేమంటే అమృతం. ద్వేషమంటే విషం. మనం దేన్ని పెంచి పోషిస్తామో అదే మనకు దక్కుతుంది. ప్రేమను ప్రేమతోనే పొందగలం.

22 కామెంట్‌లు:

  1. నిజంగా ప్రేమంటే తెలియని వీల్లకు ప్రేమగూర్చి చెబితే ఎలా? వీల్లది ఆకర్షణ కేవలం

    రిప్లయితొలగించండి
  2. మీ టపా ఎంతో మందికి కనువిప్పు కలిగించేదిగా వుంది. మనసుంటే ఈ ప్రకృతిలో ప్రతీదీ ప్రేమించదగ్గదే..

    రిప్లయితొలగించండి
  3. Line to Line Heat Bro! People need dare enough for them selfs first to haldle something. It could be love or Hatred. But the bottom line is to have a right composition of dare, maturity in understanding things, patience and valueing values.

    రిప్లయితొలగించండి
  4. దుర్గేశ్వర్ గారికి:
    వీళ్లది అంటే నేటి తరమనా మీ ఉద్దేశం.
    నేటి తరానిది కేవలం ఆకర్షణ అనేది నేను అంగీకరించనండీ. ఎందుకంటే ప్రేమ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ దానిని వ్యకత పరచటం, దాని విలువను గుర్తించటం మాత్రమే నేటి తరానికి అంతగా తెలియనిది. మంచి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దాన్ని వెలికి తీసే దిశగా ప్రయత్నించడమే నా లక్ష్యం. మీలాంటి పెద్దల ఆశీర్వాదాలుంటే అదితప్పక ఫలిస్తుంది. :)

    రిప్లయితొలగించండి
  5. జగదీష్ గారికి: నిజమే నండీ... ధన్యవదాలు. :)

    శివ గారికి: శివగారూ నాకు ఇంగ్లిపీసు రదండీ...! :)
    దాన్ని కాస్త తెలిగిస్తే ఆనందిస్తాను. ధన్యవాదాలు. :)

    రిప్లయితొలగించండి
  6. మంచి విశ్లేషణ ! ప్రతి పిల్లల పెంపకంలోనూ తల్లితండ్రులది కీలక మైన బాధ్యత ! తర్వాత గురువులూ , స్నేహితులూ ...
    టీనేజ్ వచ్చేసరికి పిల్లలకు తల్లి తండ్రులు తమ స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలను హరించే విలన్లుగా కనపడతారు .అటువంటి సమయంలో సరైన స్నేహితులు దొరికితే వారి జీవితం బావుంటుంది లేదంటే ప్రలోభాలకు లోనయ్యి పతనమయ్యే అవకాశాలు ఎక్కువ .ప్రేమను ప్రేమతోనే పొందగలం ఈవిషయం అర్ధం చేసుకుంటే ఆడపిల్లలపై ఈ దాడులు జరగవు జరగవు.మంచి టపా రాశారు .

    రిప్లయితొలగించండి
  7. బాగుంది టపా. నిజమే ప్రేమ కు మొదట అర్ధం తెలుసుకోవలి అందరం అన్ని తరాల వారు కూడా.. కాని ఈ లైన్ నవ్వు వచ్చింది మీరు రాసింది. "చిన్నప్పటి నుండే స్లీవ్ లెస్ వేసుకోవడం నేర్పిన తల్లి, పెద్దయ్యాకా చీరలు కట్టమంటే కూతురు ఎంతవరకూ వింటుంది? " దీనికి ప్రేమ కు సంబంధం ఏమిటి.. సంస్కారానికి స్లీవ్లెస్స్ లకు సంబంధం ఏమిటి అని. అన్యధా భావించకండి... మంచి టపా.

    రిప్లయితొలగించండి
  8. పరిమళం గారికి : టీనేజ్ వయసులో మంచి స్నేహితులు దొరికినా వారికీ నేటి పరిస్ధితులు అయోమయం గానే ఉంటున్నాయి. చుట్టూ ఉన్నవాళ్లు ప్రేమ పేరుతొ ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటే ఆ ఆకర్షణలతో అటు వెళ్ళలేక , ఇటు చడువులమిడ మనసు నిలుపలేక సతమతమౌతున్నారు. ఈ లోపు ప్రేమ అంటు ఎవరో ఒకరు వెంట పడితే తప్పు చేస్తున్నామో ఒప్పుచేస్తున్నమో తెలియని స్థితిలో ఆ ప్రేమల వలలో పడుతున్నారు.

    కనుక ఇటువంటి స్థితిలో పిల్లలకు పెద్దల సలహాలు చాల అవసరం. కానీ అవి స్నేహ పూర్వక మైన వాతావరణంలో ఉండాలి. అంతేగాని మేము పెద్దలం , మేము చెప్పేదే కరెక్ట్ , నువ్వ్వు అలాగే నడుచుకోవాలి అంటే.. పిల్లలు చస్తే వినరు. మీరన్నట్టు వాళ్ళకు పెద్దలు విలన్లు లాగా కనపడతారు. కనుక పెద్దలు కూడా టీనేజ్ వయసు పిల్లలతో స్నేహితుల్లాగా మెలగాలి.... ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  9. భావన గారికి : మంచి ప్రశ్న వేశారు . ఆడపిల్లకు అణకువ నేర్పాలి తల్లి.

    అటువంటిది పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే పెద్దయ్యాక నిండుగా చిర కట్టుకో మంటే అది నచ్చదు వాళ్ళకి. అలా అని మన సంప్రదాయం ఇది. నువ్వు లంగా ఓణీలు, చీరలె కట్టుకోవాలి అంటే అదికూడా తప్పే... ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు జీన్స్ వేస్తుంటే వీళ్ళు సాంప్రదాయ వస్త్రాలు కట్టాలంటే దానికి మానసిక బలం చాల అవసరం. ఆ స్థితి వాళ్ళకు వచ్చే దాక ... చిన్నప్పటి నుండి రెండు అలవాటు చేస్తే ఏది తమ వ్యక్తిత్వానికి సరిపోతుందో పెద్దయ్యాకా వారే నిర్ణయించు కుంటారు.
    నా దృష్టిలో మన భారతీయ స్త్రీలు చిరలోనే హుందాగా ఉంటారు. ఈ మాట అందరికి నచ్చక పోవచ్చు. ఎవరి అభిప్రాయం వారిది. ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  10. మంచి టపా. ఇప్పటి పరిస్థితులకు అర్థం పడుతూ చాలా బాగా వ్రాసారు. తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ చాలా కీలకం. ఒక్కోసారి వాళ్ల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలాగా తయారవుతుంది. పరిస్థితులని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకునే మానసిక పరిపక్వత ఇటు తల్లిదండ్రులలోనూ అటు పిల్లలలోనూ ఉండాలి.

    రిప్లయితొలగించండి
  11. >> "చిన్నప్పటి నుండే స్లీవ్ లెస్ వేసుకోవడం నేర్పిన తల్లి,
    మంచి టపా వ్రాసారు కానీ ఇది ఒక్కటీ అంగీకారంగా లేదు again its an individual call ప్రేమ అన్నది అనుభవం నుండి జనించే భావన. మనిషి బాహ్య వర్తనకీ అంతరర్గత మనస్తత్వ్వానికి లంకె వేయలేం. గోముఖ వ్యాఘ్రం అని వినలేదా. sleeveless నేనూ వేస్తాను, అంతమాత్రాన నేను సంస్కారవిహీననా, ప్రేమరాహిత్యం వున్నదాన్ననా. తల్లితండ్రి ధోరణి + రక్షణ, పెరిగే వాతావరణం, స్వభావం ఇవన్నీ కలిసి మలిచే వ్యక్తిత్వం గురించి మాట్లాడాలి కానీ కట్టు బొట్టు కాదు. And my kids are recognized to be very well matured and do excel at School. They are born abroad yet know about India a lot better than many kids born there. They support me a lot pretty much in everything I do and ours is a no bars held relation.

    రిప్లయితొలగించండి
  12. ఒక కొత్త కోణంలోంచి ఆలోచించారు.
    మంచి టపా.
    విశ్వప్రేమికుడు అన్న పేరుని సార్థకం చేస్తూ అన్ని పరిస్థితులలోని ప్రేమని గురించీ వ్యాఖ్యానించారు.
    భార్యాభర్తలు, ప్రేమికులు, పెద్దలు- పిల్లలు ఇలా.

    రిప్లయితొలగించండి
  13. @ ఉష గారు: మీ కుటుంబ పరిస్థితులు వేరండీ... మీకు లాంటి తల్లి ప్రేమ అందితే అందరి పిల్లలూ ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. కొన్ని పరిస్థితులలో కొన్ని తప్పు కాకపోవచ్చు. మీరున్నది అబ్రాడ్ కాబట్టి అక్కడ దాని ( వస్త్ర ధారణ ) ప్రభావం అంతగా ఉండదు.

    నేను చెప్పేది ఆంధ్రాలో పుట్టి పెరుగుతున్న వారి గురించి.

    రిప్లయితొలగించండి
  14. bagundi kaani, naaku nachaledu konni chotla mee visleshanalu.
    all the best! :)

    రిప్లయితొలగించండి
  15. @ క్రియేటివ్ కుర్రోడు : కొన్ని విషయాలలో విశ్లేషణ అవసరమనిపిస్తుంది. అది కొంతమందినైనా ఆలోచింపచేస్తుందికదా అనే నా భావన.

    మీ వ్యాఖ్య నాకు చాలాబాగా నచ్చింది. ఎటువంటి విశ్లేషణలు మీకు నచ్చలేదో కూడా స్పష్టంగా తెలియజేస్తే మరింత బాగుండేది. ఇటువంటి నిస్కర్షమైన వ్యాఖ్యలు మరిన్ని మీనుండి ఆశిస్తున్నాను. అవి నాలో నన్ను ఆలోచింపచేస్తాయి.

    ధన్యవాదాలు. :)

    రిప్లయితొలగించండి
  16. బాగుంది మీ విశ్లేషణ. నా రెండు పైసలు

    1. ఇంట్లో ఎంతో ఒద్దికగా కనిపించే పిల్లలు బయటకి వచ్చాక వీరంగం వెయ్యటం. ఇది నేను నా కళ్ళతో చూస్తున్నా. కట్టూ బొట్టూ ఎంతో మర్యాదగా ఉంటుంది కానీ ఎక్కడ ఎవరిని పడేద్దామా అన్న తపన వారి ప్రవర్తనలో అణువణునా కనిపిస్తోంది

    2. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియకపోయినా ఎవరినో ఒకరిని ప్రేమించెయ్యాలి, లేకపోతే నామోషి అనుకునే స్థాయిలో యువతీయువకుల ఆలోచనలు

    ఇంట్లో వాళ్ళు మాత్రం ఎంత వరకని చెప్పగలరు? వారి సొంత వ్యక్తిత్వం వారికి ఉండాలి కానీ?

    రిప్లయితొలగించండి
  17. తల్లితండ్రులు ఎంత జాగ్రత్త తీసుకున్నా ప్రస్తుత కాలంలో ఉన్న ఆకర్షణలనుంచి పిల్లలని కాపాడగలరా..! బయటి ప్రభావమే వారిమీద ఎక్కువగా కనిపిస్తోంది కదా.సినిమాలని మార్చగలమా? చానల్స్ ని మార్చగలమా? పెరుగుతూ పోతున్న ఆసిడ్ దాడులకు కారణమేంటి? ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశమే లేదసలు. పెద్దలకే తెలియని ఎన్నో ఆకర్షణలకే కదా పిల్లలు బలవుతున్నారు. ఈ సమస్యకి అసలైన పరిష్కారం ఏంటి?

    రిప్లయితొలగించండి
  18. తల్లో, తండ్రో ఉద్యోగం మానేయడమే ఈ సమస్యకి పరిష్కారం అని నేను అనుకోడం లేదండి.. అలా మానేసిన వాళ్ళ పిల్లలంతా బుద్ధిగా ఉన్నారనీ చెప్పలేము.. నిజానికి పిల్లలకేi క్రమశిక్షణ అనేది రాత్రికి రాత్రే నేర్పగలిగేది కాదు. 'మొక్కై వంగనిది మానై వంగదు' అని కదా వాడుక. ఇక స్లీవ్ లెస్ ధరించడం అన్నది ఒక ప్రాంతపు సంస్కృతి.. బహుశా అక్కడి వాతావరణ పరిస్థితులవల్ల మొదలైంది కావొచ్చు.. ఎన్నో అలవాట్ల లాగే ఇదీ మనదగ్గరికి వచ్చి మనదైపోయింది.. 'స్లీవ్లెస్' కి 'క్రమశిక్షణ' కి ముడి పెట్టడం మినహాయిస్తే, బాగుంది మీ టపా..

    రిప్లయితొలగించండి
  19. నిజమైన ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు కాని, నిజమైన ప్రేమ గెలిచినా, ఓడినా బాధ పడదు.

    రిప్లయితొలగించండి
  20. లక్ష్మి గారికి: నిజమే యువతీ యువకులూ వాళ్ల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ క్రమంలో తల్లితండ్రులు వారి నేటి అసలు స్థితిని గుర్తించి తగిన మానసిక బలాన్ని ఇవ్వాలి.

    జయ గారికి : పరిష్కారం అంత సులభమైనది కాదు. పెద్దలు పిల్లలు కలిసి సమస్యా పరిష్కార మార్గం వైపు దృష్టి సారిస్తే సమస్య తీవ్రత తగ్గ వచ్చు.

    మురళీ గారికి : అందుకే మొక్కలుగా ఉన్నప్పుడే పిల్లల వ్యక్తిత్వ నిర్మాణ క్రమంలో వారికి తగిన చేయూతను ఇవ్వమని అంటున్నాను. నేను ఎవ్వరినీ ఉద్యోగం మానేయమనడం లేదు. పిల్లల మనసులకు దగ్గరవ్వమంటున్నాను. నేటి సమాజంలో టీనేజర్స్ ఎదుర్కునే నిజమైన సమస్యలను గుర్తించమంటున్నాను.

    లక్ష్మి గారన్నట్టు పిల్లలు భయం కొద్దో, భక్తి కొద్దో పెద్దల వద్ద తమ నిజ స్వరూపాన్ని దాచిపెడుతున్నారు. ఇంటి దగ్గర రాముడి లాగా ఉన్న వాడే... స్కూల్లోనూ, కాలేజీల్లోనూ క్రిష్ణుడో, కామకుడో అవుతున్నాడు. ఆడపిల్లలు మరీ జీవించేస్తున్నారు. ఎవరికీ నేటి పరిస్థితులలో ఆకర్షణలకు తట్టుకునే శక్తి లేదు. ఇటు వంటి పరిస్థితులలో తల్లి తండ్రులు తమ పెద్దరికపు హోదాలో కాక, కాస్త పిల్లల స్థితికి వచ్చి ఆలోచించి సరైన మానసిక బలాన్ని వాళ్లకు ఇవ్వాలి.

    ఇక స్లీవ్ లెస్ లు అనే పదాన్ని నేను పొట్టి బట్టలు అనే అర్ధంలో వాడాను. స్లీవ్ లెస్ ల వరకూ ఫర్వలేదు, నేటి చిన్నపిల్లలు కూడా ఓ రకమైన డ్రెస్స్ కోడ్ మొదలు పెట్టారు. ఇతర దేశాలలో అది అంత ప్రభావ వంతం కాదు కానీ ఇక్కడ కాస్త ఆలోచించాలని నా ఉద్దేశాం. ధన్యవాదాలు.

    ఈ టపా ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించ గలరు. మీ విలువైన అభిప్రాయాలను నాతో పంచుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. :)

    రిప్లయితొలగించండి
  21. మీ స్నేహితుడు గారికి : సరిగ్గా చెప్పారు. మీ బ్లాగ్ ఇప్పుడే చూశాను. అద్భుతంగా ఉంది. :)

    రిప్లయితొలగించండి
  22. meeru chala chala baaga rasthunnaru,premalo padithe vichakshana kolpotharu.varini marchadam devudi tharam kuda avadu.premanedi plan chesukuni nenu ishta padutunna nuvvu ishtapadu ante yela..........premante yeppudu yekkada yevarimadhya puduthundo cheppalemu.......alaa puttina prema thappakunda chala easyga gelusthundi.

    రిప్లయితొలగించండి