About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

8, ఆగస్టు 2009, శనివారం

జొగారావు. భాగ్యం. బ్లాగు - కథా... కమామిషూనూ...........


జోగారావు పుట్టింది నరసాపురంలో ఐనా 10వ తరగతికి వచ్చేటప్పటికి నసీబు బాగుండి తల్లితండ్రులతో పాటు నాంపల్లి స్టేషన్ కాడికొచ్చి పడ్డాడు. జోగారావు తండ్రి స్టేషన్ లో కూలీ మేస్త్రీ, తల్లి స్టేషన్ బయట పల్లీలు చేగోడీలూ అమ్మేది. "మన బతుకెలాగో చదువు లేక ఇలా ఏడిచింది, ఆణ్నైనా కాస్త చదివించి పెద్ద సాప్టువైరుని చేయించాల" అని తల్లి పట్టు పట్టడంతో జోగారావుని ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చేర్పించారు.

అక్కడినుండి జోగారావు సుడి తిరిగింది. అమ్మా నాన్నా చదివించడానికి ఎంత కష్టపడ్డారో జోగారావు కూడా అంతే కష్టపడ్డాడు అమ్మాయిల్ని పడేయడానికి. నరసాపురం తెలివి ఈ పట్నం పాపల ముందు ఎక్కడా వర్కవుటు అవ్వకపొవడంతో ఇక తప్పక తన దృష్టిని కాస్త చదువుమీద పెట్టాల్సి వచ్చింది. ఈ (తెలివైన చదువుకునే కుర్రోడు అనే) ఇమేజ్ కూడా అమ్మాయిల దగ్గర కాస్త పనికొస్తుందని తెలిసి ఎగిరి గంతేశాడు. మరి ఆ ఇమేజ్ ని కాపడుకోవడనికనో ఏమో తనకు తెలియకుండానే ఇంటర్ పాసవడం, ఎంసెట్ అయిపోడం, ఇంజనీరింగ్ కూడ పూర్తవడం చకచకా అయిపోయాయి. అమ్మాయిలు అందరూ తన అవసరం ఉన్నపుడు "జోగీ" అని ముద్దుగా పిలుస్తూ పనులు చేయించుకునేవారు. అవసరం తీరాకా తుర్రుమనేవారు. ఏంటో ఎవ్వరి దగ్గరా తన హీరోయిజం హైలేట్ అవ్వకపోయేటప్పటికి మన జోగారావు కలలు కలలుగానే మిగిలిపొయాయి.

ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టిన జోగారావుకి ఓ పట్టాన ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఒకరోజు జోగారావుకి పొద్దున్నే ఓ కల వచ్చింది. "ప్రిన్స్ మహేష్ బాబులా తయారైన జోగారావుని తెల్లచీర కట్టుకున్న త్రిషలాంటి ఓ అమ్మాయి వచ్చి కౌగలించుకుంది. జోగీ నువ్వు నిజంగా హీరోవిరా.... అంటోంది". అంతలో దబుక్కున తెల్లరింది. కొంపలు మునిగిపోయినట్టు వాళ్లమ్మ లేపడంతో ఉలిక్కిపడి లేచాడు జోగారావు. ఎదురుగా చీపురు పట్టుకుని ఉన్న వాళ్లమ్మని చూసి దడుచుకుని, చేతుల్లో నలిగిపోతున్న దిండుని ప్రక్కన పడేసాడు. "ఏరా ఎంతసేపురా పడుకునేది. బారెడు పొద్దెక్కింది ఇల్లూడవాలి లే...." అని వాళ్లమ్మ అనడంతో మంచి కల పొయిందని తిట్టుకుంటూ లేవక తప్పిందికాదు.

స్నానం కానిచ్చి, అమ్మ తిట్లతో కలిపి వడ్డించిన ఉప్మాని లాగించి బయట పడ్డ జోగారావుకి దారిలో ఎవరో శాస్త్రి గారు కనిపించారు. ఆయన్ని చూడగానే తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. తనకు ఈ శాస్త్రాలూ మొదలైన వాటి మీద పెద్ద నమ్మకం లేకపోయినా.., ఊరికే ఈ శాస్త్రి గారు తన కల గురించి ఏమంటారో సరదాగా విందాం అనిపించింది. వెంటనే తన కలను వివరించి ఏమవుతుంది పంతులుగారూ..? ఈ కల మంచిదా? చెడ్డదా? అని అడిగాడు.

ఆయన జోగారావుని ఓసారి పైనించి క్రిందికి చూసి " ఒంటి మీదకి పాతికేళ్లు వస్తున్నా పెళ్లీ పెటాకులూ లేకుండా ఇలా రోడ్లమ్మట తిరుగుతూ, కనిపించిన ప్రతి అమ్మాయినీ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తుంటే అలాంటి కలలే వస్తాయి. అందుకే పెద్ద ముండావాళ్లం మేం మొత్తుకునేది 'బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా కష్టంరా' అని. అందులో ఈ కాలం ఆడ పిల్లలు బి.టెక్కులూ గట్రా చదివి మహా `హైటెక్కీ పోతున్నారు. పూర్వంలాకాదు, ఇప్పుడు వాళ్లచేత ఓ.కే. అనిపించాలంటే మా తల ప్రాణం తోకకి వస్తోంది." అంటూ దండకం అందుకునేసరికి `అబ్బా ఈయన ఈ రోజుకి తెవిల్చేటట్టు లేడు. అయినా అర్ధం కాకుండా మాట్లాడతాడేంటీ..? బెండకాయకీ, బ్రహ్మచారికీ లింకేమిటబ్బా..? ' అని మనసులో సణుక్కున్నాడు.

అంతలో ఆయన ` తోక అనడం గుర్తుకు వచ్చి విచిత్రంగా ఊగుతున్న పంతులుగారి ` పిలక ' కేసి చూసి తనలోతనే నవ్వుకుంటూ, `ముందు ఉద్యోగం రావాలికదండీ.. దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నాను ' అన్నాడు. ఆయనేం అనుకున్నాడో.!? ఓ సారి మళ్లీ తేరిపార చూసి "ఆ... సరి సర్లే... తెల్లవారు తుండగా వచ్చిందన్నావు కదా.!? అందులోనూ తెల్లబట్టలు వేసుకున్న అమ్మాయి అన్నావు... అంటే... నీకు త్వరలో లక్ష్మీ కటాక్షం కలగబోతోందోయ్. నీకు ఉద్యోగం ఖాయం. తథాస్తూ.'' అని ఆశీర్వదించారు. అదివిని జోగారావు ఆనందంతో దక్షిణ సమర్పించుకొని ఇంటర్వ్యూకి ఆలస్యమవుతోది అనుకుంటూ గబగబా వెళ్లాడు.

అక్కడ అనుకోకుండా అచ్చం తన కలలో చూసిన అమ్మాయిలాంటి అమ్మాయి కనిపించడమూ, ఆమెకూడా తెల్ల చొక్కాలాంటిది వేసుకొని ఉండడమూ, ఇక జోగారావు తన హీరోఇజాన్నంతా ప్రదర్శించి ఇంటర్వూలన్నీ పాసయిపోయి ఉద్యోగంలో సెలెక్టవ్వడమూ అన్నీ ఆశ్చర్యంగా కలలోలా జరిగిపోయాయి.

ఇంటర్వూ చాంబరు నుండి బయటకొచ్చిన జోగారావుని వెనకనుండి ఎవరో కంగ్రాచ్యులేషన్స్ అనడంతో అటు తిరిగాడు. ఎదురుగా స్వప్న సుందరి, నవ్వుతూ నాపేరు `భాగ్యలక్ష్మీ, అందరూ భాగ్యం అంటారు. నేను మీ టీమే. నన్ను మీకు గైడ్ చెయ్యమని చెప్పారు. మీకే డౌటున్నా నన్ను అడగవచ్చు ' అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. జోగారావు గాల్లో పైకి తేలిపోయి సీలింగ్ కొట్టుకుని క్రిందికొచ్చి చెయ్యిని సుతారంగా వూపి థాంక్యూ.. థాంక్యూ... అనిచెప్పి బయటకొచ్చాడు.

ఇక ఆనందం తట్టుకోలేక హైటెక్ థియేటర్ లో `ఆడవారి మాటలకు అర్థాలెవేరులే ' సినిమాకి వెళ్లాడు. అందులో వెంకీకి త్రిషా కనిపించడం, ఆమెవల్లే జాబ్ రావడం ఇవన్నీ సరిగ్గా తనకు జరిగినట్టే జరిగేసరికి ఏంటీ నన్ను గానీ ఎవరైనా అజ్ఞాతంగా అనుసరిస్తున్నారా అని గాబరా పడిపోయాడు. అంతలో తనకంత సీన్ లేదని గుర్తుకువచ్చి సర్దుకున్నాడు.

ఆ రోజంతా ఆలోచనలతో నిద్ర సరిగ్గా పట్టలేదు. తనకు కలరావడం, పంతులుగారి ఆశీర్వాదం ఫలించి తనకు ఉద్యోగం రావడం, అక్కడే తన స్వప్న సుందరి కనిపించడం అంతా ఆశ్చర్యంగా అనిపించింది. "పంతులు గారి మాటలకు ఇంత శక్తి ఉంటుందనుకోలేదు. లేకపోతే దక్షిణ కాస్త ఎక్కువ చదివించుకునైనా `శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ అనికూడా అనిపించేసుకునే వాడిని" అనుకున్నాడు. తన జీవితంలోకి ప్రవేశించిన భాగ్యంతో ప్రేమ నిచ్చెన ఎలా ఎక్కాలా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు.

జోగారావు జాబ్ లో చేరి చాలా రోజులవుతోంది. భాగ్యంతో స్నేహం పెరుగుతోంది. ఆమెని మనసులో ముద్దుగా `భాగీ' అని పిలుచుకుంటున్నాడు జోగి. ఆమెగురించి ఈ మధ్యే జోగారావుకు కొన్ని ఆశక్తికర విషయాలు తెలిశాయి. ఆమెకు అమ్మ అన్నా, ఆవకాయ అన్నమన్నా, ఐస్ క్రీం అన్నా, వాళ్ల సొంత ఊరు అమలాపురమన్నా, తెలుగు భాష అన్నా మహా ఇష్టమనీ, ఆ ఇష్టం తోటే `అమ్మా.ఆవకాయా.అమలాపురం' అనే బ్లాగును తెలుగులో ప్రారంభించిందనీ తెలిసింది.

ఇక అప్పటి నుండి జోగారావు మనసు మనసులో లేదు. భాగ్యం బ్లాగు చుట్టూ తిరుగుతోంది. జోగారావుకి తన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. "ఆ రోజుల్లో ఎన్నో కథలూ, కవితలూ చెప్పేవాడు తను. ఎప్పుడైనా కొత్త కథ దొరక్క పోతే తనే ఓ కథ అల్లి, అందులో తమనే హీరోలుగా పెట్టి ఓ త్రీడి సినిమా చూపించేవాడు. అప్పట్లోనే తన ప్రతిభను ప్రపంచానికి చాటాలని ఓ కథా పుస్తక గ్రంథ రాజాన్ని మొదలు పెడితే దాన్ని చూసి ఇంట్లో వాళ్లందరూ నవ్వడంతో కోపం వచ్చి ఆ బృహత్ కార్యాన్ని వాయిదా వేశాడు గానీ... లేకపోతే ఇప్పటికి తన కలం నుండి ఎన్ని కథా సంకలనాలూ, కవితా సంపుటులూ వెలువడి ఉండేవో..." అనుకుని తన భాగ్యాన్ని మెప్పించటం కోసమైనా తనూ ఓ బ్లాగుని బ్లాగాలని నిశ్చయించుకున్నాడు. "కానీ ఆబ్లాగులో ఏమి రాయాలో, రాసినా తన విశాల భావాలను తన చుట్టూ ఉన్నవారు చూసి తట్టుకోగలరో లేదో తెలియక, అందులోనూ తను రాసేది ఖచ్చితంగా నలుగురికంటే వైవిధ్యంగా ఉంటుంది కాబట్టి తనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసే అవకాశాలు లేకపోలేదు. అది చూసి తన గిట్టని వారు తట్టుకోలేకపోవచ్చు. అసలే భాగ్యం తనతో క్లోజ్ గా ఉండడం చూసి కొలీగ్స్ అందరూ ఉడుక్కుంటున్నారు. తనకూ, భాగ్యానికీ చెడగొట్టినా కొట్టవచ్చు. అందుకే తన పేరు బయట పెట్టకుండా బ్లాగ్ ప్రారంభించాలి" అని నిర్ణయించుకున్నాడు.

జోగారావు కల పంతులుగారి ఆశీర్వాదంతో నిజమవుతున్న నాటినుండీ అతను గుడికి వెళ్లడం మొదలుపెట్టాడు. అతని ఆనందాన్నీ, బాధనూ ఆ భగవంతుడితోనూ, పంతులు గారితోనూ చెప్పుకుని ఉపశమనం పొందుతూ ఉండేవాడు. అలాగే ఓ రోజు తన బ్లాగు గురించి చెప్పి ఆశీర్వాదాన్ని పొందుదామని గుడికి వచ్చాడు. ఆ రోజు గుడి ప్రాంగణంలో కవిసమ్మేళనం జరుగుతోంది. అక్కడ కవిత్వం గొప్పదనాన్ని వివరిస్తున్నాడో కవి. "64 కళలలోనూ లలిత కళలు 5 గొప్పవి. ఆ 5 కళలలోనూ కవిత్వం గొప్పది. గ్రుడ్డి వాడు, మూగవాడు కూడా విని భావన చెంది ఆనందించగలిగే ఈ కవిత్వాన్ని రాసే కవి భూలోక బ్రహ్మ" అంటూ చెప్పుకు పోతున్నాడు కవి. ఇంక తరువాతి మాటలు జోగారావుకు ఎక్కలేదు. బ్లాగడం కూడా ఒక విధంగా రచనా చాతుర్యాన్ని ప్రదర్శించడమే కాబట్టి భగవంతుడు నన్ను ప్రోత్సహించడానికే ఈ కవి ద్వారా మెసేజ్ ఇచ్చాడని ఆనందంలో తేలిపోతూ ఇంటికి వచ్చాడు.

ఓ శుభ ముహూర్తం చూసుకుని బ్లాగుని ప్రారంభించాడు. తన పేరు పెట్టకూడదు అనుకున్నాడు కాబట్టి అమ్మాయిల్లో బాగా క్రేజ్ ఉన్న మహేష్ కి హిట్ ఇచ్చిన `పోకిరీ ' అనే పేరుని తన కలం పేరుగా ప్రకటించుకున్నాడు. తన బ్లాగుకు `బలాదూర్' అనే టైటిల్ పెట్టాడు. `అనుష్కా ఒక్కటి తక్కువ ' అనేది టాగ్ లైన్. గుర్రం మీద వెళ్తున్న కౌబాయ్ ఫొటోని తన ఫొటోగా పెట్టుకున్నాడు. ఇలా అనేక హంగులతో బ్లాగు సృష్టించుకుని కూడలిలో పెట్టాడు. ఏదో ఒక రోజు తన బ్లాగు భాగ్యం కంట పడక పోతుందా అని అతని ఆశ. బ్లాగు ప్రారంభించి నెల రోజులైంది. ఎవరో కొంతమంది అప్పుడప్పుడూ తమ వ్యాఖ్యలు రాసేవారు, కానీ భాగ్యం నుండి ఎటువంటి స్పందనా కనిపించలేదు. అసలు ఆమె తన బ్లాగు చూసిందా? లేదా? ఒక వేళ చూసినా కామెంట్ చేసేంత అనిపించలేదా? ఇలా అనేక అలోచనలు చేసి ఇక నుండీ జనరంజకంగా బ్లాగుని తయారు చెయ్యాలనుకున్నాడు. అనేక రకాల ప్రయోగాలు చేశాడు. కథలు, కవితలు, వ్యాసాలు ఇలా ఏది రాయాలనిపిస్తే అది రాసి పడేసే వాడు.

ఒక రోజు జోగారావు, అతని ఫ్రెండుని ఏవో మాటల సంధర్భంలో నిన్న చూసిన హిందీ సినిమాలో హీరోయిన్ ఎలావుందిరా అని అడిగాడు. ఆ `దీపికా పదుకొనే' అంత అందంగా లేదురా.. అన్నాడు. జోగీకి మరోలా వినపడింది. అర్థంకాక ఆ ఏంటిరా అన్నాడు. అదే `దీపికా పదుకొనే' అంత గొప్పగా లేదురా అని చెప్పాడు. ఓ అదా నువ్వన్నదీ నాకు ఆ రెండు ` ద ' కారాల స్థానంలో ` డ ' కారం వినపడిందిలే అని వివరించే సరికి ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. ఇంతలో జోగీకి అదిరిపోయే అవిడియా వచ్చింది. ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులతో ఓకొత్త పోస్ట్ తయారుచేస్తే తన పేరు ఎక్కడికో వెళ్లిపోతుంది కదా అనిపించింది. ఆలస్యం లేకుండా పోస్ట్ తయారు చేశాడు. ఇక ఆరాత్రంతా నిద్ర పట్టలేదు జోగారావుకి. ఆ కొత్త పోస్ట్ భాగీ చూస్తే ఎలా స్పందిస్తుందో.. నాలో ఇంత రసికత ఉందని ఎక్స్పెక్ట్ చేసిఉండదు.. ఈ దెబ్బకి నాకు బ్లాగ్ లోకంలో క్రేజ్ వచ్చేస్తుంది.. అని ఆలోచిస్తూ నిద్ర పోయాడు

మరునాడు ఎన్నడూ లేని విధంగా అతని పోస్ట్ కి మొదటి సారి ఇరవై ఎనిమిది కామెంట్లు వచ్చాయి. ` వొకడు అదిరి పోయింది గురూ ' అంటూ రాస్తే వేరొకడు `కెవ్వు కేకా మామా' అన్నాడు. మరొకడు ` డబుల్ ధమాకా సూపర్ ' అన్నాడు. ఇలా మొత్తమ్మీద అన్నీ పొగడ్తల్తో ముంచెత్తినవే. జోగారావు ఇక రెచ్చిపోయి `కిసుక్కులు' రాయడం మొదలెట్టాడు.

ఒక రోజు భాగ్యం నుండి వ్యాఖ్య వచ్చింది. " మీ బ్లాగులో కాస్త సభ్యతతో కూడిన టపాలు రాస్తే మంచిదనీ... లేక పోతే మీ సంగతి తేలుస్తాం అనీ " ఇది చదివిన జోగారావు కాస్త ఖంగు తిన్నాడు. ఒక్కసారి తన బ్లాగుని తానే చదువుకున్నాడు. అప్పుడు అర్ధమైంది తన రాతలు ఎంత చిరాకుగా ఉన్నాయో. తన బ్లాగులో వ్యాఖ్యలు రాసే వాళ్లలో ఒక్క ఆడవారూ లేరు.

తన భాషా ప్రయోగం శృతి మించి గతి తప్పిందని జోగారావు తెలుసుకునే లోపల భాగ్యం "పేరులేని పోకిరోళ్లు" అనే టపా పెట్టింది. దానితో బ్లాగు లోకంలో ఓ గాలి దుమారం లేచింది. కొంతమంది మొగ వాళ్లు అతనిని సమర్ధించారు. కానీ చాలా మంది తిట్టి పోశారు. ఆడా మొగా రెండు వర్గాలుగా గొడవలు ప్రారంభ మయ్యాయి. ప్రతీ ఒక్కరికీ అతని బ్లాగు ఒక రచనా వస్తువయ్యింది. తన రాతలకు ఈకలు పీకడం చూసి అతనికి విపరీతమైన కోపం వచ్చింది. అతని మీద అతనికే విరక్తి కూడా కలిగింది. అందులోనూ భాగ్యమే తన ప్రధాన ప్రత్యర్ది కావడం తట్టుకోలేక పోయాడు. ఈ జోగీ`లోపలి మనిషి ' ఇంత దుర్మార్గుడని ఊహించలేక పోయాడు. ప్రేక్షకుల మెప్పు కోసం రాస్తే మొదటికే మోసం వచ్చింది. తనకి ఏది నచ్చుతుందో అదే రాయాలని తెలుసుకునే సరికి బ్లాగు మూసివేయాల్సినంత వత్తిడి వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే తను ఎవరో కూడా కనిపెట్టేస్తారేమో అనే భయంతో జోగారావు బ్లాగుని మూసి వేసాడు.

భాగ్యాన్ని మెప్పించే ప్రయత్నంలో తలకు బొప్పి కట్టింనంత పని అవ్వడంతో జోగారావు భాగ్యంతో మునుపటిలా ధైర్యంగా మాట్లాడ లేక పోతున్నాడు. కానీ తన ఆశలు చంపుకో లేక సతమత మవుతున్న సంధర్భంలో జోగారావుని ఆ ఏడాది బెస్ట్ పెర్ ఫార్మర్ గా టి.ఎల్. ప్రకటించడమూ, అదే రోజు రాత్రి భాగ్యం వచ్చి నైట్ డిన్నర్ కి వస్తావా అని పిలవడమూ అన్నీ అనుకోకుండా జరిగిపోయాయి. జోగారావు మదిలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ సారైనా ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకోవాలి అనుకుంటూ ఆమె వెంట నడిచాడు జోగారావు....


ఈ కధ ఎవ్వరినీ అనుకరించినది గానీ, ఎవ్వరి మనో భావాలనూ దెబ్బతీయటానికి గానీ రాసినది కాదు. ఈ కధలోని పాత్రలు పూర్తిగా నా కల్పితాలు . పాఠకులను ఆహ్లాద పరచ వలెను అనే ఉద్దేశంతో మాత్రమే ఈ కధను రాయడం జరిగింది. నా ఈ మొదటి కధా ప్రయత్నాన్ని పెద్దమనసుతో మన్నించి ఆశీర్వదించగలరు.

మీ
-విశ్వ ప్రేమికుడు :)

18 వ్యాఖ్యలు:

 1. బ్లాగులని బాగా పరిశీలించి రాసినట్టున్నారు. అచ్చుతప్పులు సరిచూసుకోండి.. శీర్షిక ఏమిటో కథ చదివితే తప్ప అర్ధం కాలేదు.. రాస్తూ ఉండండి... అభినందనలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మురళీ గారికి నా బ్లాగులోకి స్వాగతం.
  ప్రస్థుతం అవి సవరించే పనిలోనే ఉన్నాను. ఈ లోపు మీరుకూడా చెప్పారు. అయినా ముందు ఓ సారి పరిశీలించి ప్రచురించవలసింది.

  మీ సూచనలకు ధన్యవాదాలు. ఇలాగే మీ సలహాలను తెలుపుతూ ఉండగలరు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బ్లాగ్ బాగుంది ...కథ ఇంకా బాగా రాయొచ్చు ప్రయతిస్తే ... ఎనీ వేస్ బాగుంది...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్రీ గారికి స్వాగతం .
  ఇక ముందు మరింత తపన చెంది రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.
  మీ సూచనలకు ధన్యవాదాలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీ జోగారావు ఏప్రిల్ 1 విడుదల సినిమా లో దివాకర్ లాగ మరీ సిన్సియర్ అనుకుంటా లేక పొతే అసలు పేరు తో కాకుండా బాగా రాసే ఏ జీడిపప్పు, నెమలికన్ను లాంటి బ్లాగు చూసికొని అది నాదే అని చెప్తే పోలా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కధ బాగుంది.
  శ్రావ్య గారి కామెంటు పట్టుకొని వచ్చి కామెంటు చదివితే అర్ధం కాలా

  అలా మొత్తం కధ చదవాల్సి వచ్చింది.

  మంచి కధను చదివించినందుకు ఆ కామెంటుకు ధన్యవాదాలు.

  జీడిపప్పు గారు, నెమలి కన్ను గారు, మీ బ్లాగుల్ని పై కామెంటు ప్రకారం ఆలోచిస్తే, ఇప్పటికే ఎవరో ఒకరు హైజాక్ చేసే ఉంటారనిపిస్తుంది. :-)

  బొల్లోజు బాబా

  ప్రత్యుత్తరంతొలగించు
 7. కధ చదివాక .. అనిపించింది..ఇది మీ మొదటి కధ కాదేమో అని..

  బాగుంది..

  అయితే..అక్కడక్కడ బ్లాక్స్ ఉన్నాయనిపించింది..కాని..కధలో మీరు చేసిన టెంపో అవి ఎక్కడా.. ఎక్కువ సేపు గుర్తు ఉండేటట్టు చేయలేదు..ఒక సారి చదవండి.. మీకే తెలిసి పోతుంది..

  కాని కామెడి బాగా పండింది.. మెచ్చు కోలు గానే నడిచింది..

  పాపం ఎప్పటి నుండో కలలు కంటున్నా జోగారవుకు.. హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తే.. హ్యాపీ గా ఫీల్ అయ్యేవాడేమో :)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నా పేరు జోగారావు. నేను సాఫ్ట్ వేరు ఇంజినీరు .. అన్నీ కరక్టే..But Where is my Bhagyam....????

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఇంతకూ నా కామెంటేంటంటే మొదటేమో అదిరిపోయింది,మళ్ళేమో కేవ్వుకేక,చివరాఖరికి డబుల్ దమాకా సూపర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్....:)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @ శ్రావ్య గారు: మరే నండీ.. పాపం అంత అవిడియా రాలేదు మన జోగారావుకి. :)

  @ బొల్లోజు బాబా గారు: స్వాగతం.
  ధన్యవాదాలండీ.
  ఇంతకీ శ్రావ్య గారి కామెంట్ ఎక్కడ పట్టుకుని వచ్చారూ? నా బ్లాగ్ లోనేనా? ఏమీ లేదు మరో బ్లాగ్ అయితే ఆ కామెంట్ కూడా చదివేద్దామనీ... :)

  @ శివ చెరువు గారు: ఇంట్లో పేపరు కెక్కినవి కొన్ని ఉన్నాయండీ... కానీ ధైర్యంగా పదుగురికీ చూపించుకొన్నది మాత్రం ఇదేనండీ.. మీ సూచనలకు ధన్య వాదాలు :)

  @ అజ్ఞాత గారు : వెతకండీ.... వెతికితే దొరకంది లేదు...
  దొరికితే మాత్రం నాకు చెప్పండే. జోగారవు -2 మొదలుపెడతాను :)

  @ చిలమకూరు విజయమోహన్ గారు : ధన్యవాదాలండీ .
  @ భాస్కర రామి రెడ్డి గారు : ఆశీర్వాదం వచ్చేసింది. ఇక భాగీ జోగీ ఒకటై పోతారంతే.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చీమలకూరు విజయ మోహన్ గరికీ, భాస్కర రామిరెడ్డి గారికీ, కొత్త పాళీ గారికి స్వాగతం :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. బాగుందండీ మీ జోగారావు బ్లాగుల కథ, శ్రీఘ్రమేవ బాగ్యం ప్రాప్తిరస్తు... మీ మిగతా కవితలు కూడా చదివేను బాగున్నాయి.. ఎలా మిస్స్ అయ్యనబ్బా మీ బ్లాగ్ ఇన్నాళ్ళు..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మీ బ్లోగ్ చూడమన్న మీ సలహాకి చాలా థాంక్స్. నిజంగా చాలా ప్లెజెంట్ గా ఆహ్లాదంగా ఉంది

  ప్రత్యుత్తరంతొలగించు
 14. భావన గారికీ జయ గారికీ నాలోకంలోకి స్వాగతం. నచ్చినందుకు ధన్యవాదాలు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. చాల చాల బాగుందండి...సరదాగా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు