About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

9, నవంబర్ 2009, సోమవారం

మా డాబా మీది నుండీ....

కంటికి ఎదురుగా ఇళ్లు కట్టకుండా వదిలేసిన విశాలమైన స్థలాలలో మొలిచిన పచ్చగడ్డి...., స్థలాలకు మధ్య మధ్యలో అక్కడక్కడా మొలిచినట్లున్న చిన్న చిన్న డాబాలు, అపార్టుమెంట్లూ... ఊరిచివరి ప్రదేశం కావడంతో మా కాలనీకి కాస్త దూరంలో గుబురుగా అలుముకున్న చెట్లు, ఒకటి రెండు పెద్ద పెద్ద రాళ్ల గుట్టలూ....పైన ఆకాశంలో మబ్బులు సూర్యుడితో దోబూచులాడుతున్నాయి. మిట్ట మధ్యాహ్నమైనా పకృతి అంతా వెలుగు నీడలతో ఆహ్లాదంగా ఉంది. మా ఇంటికి ఈశాన్యంగా ఉన్న దేవాలయం పై కాషాయపు జెండాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. దూరంగా ఖాళీ స్థలాలలొ వేసుకున్న చిన్న చిన్న గుడారాలు. వాటి మధ్యలో పెరిగిన తుమ్మ చెట్లు నగర జీవులకి మేమే మహావృక్షాలం అని విర్రవీగుతున్నట్లుగా తలలు ఊపుతున్నాయి. తుమ్మ చెట్ల క్రింద పిల్లవాడొకడు వాళ్ల నాన్న చొక్కా అనుకుంటా వేసుకున్నాడు. తలకాయ, కొద్ది కొద్దిగా కాళ్లూ చేతులూ మాత్రమే కనపడుతున్నాయి. ఆనందంతో చొక్కా పట్టుకుని గెంతుతున్నాడు. ప్రక్కనే దారిలో కోడి పెట్టలు తిరుగుతున్నాయి.

గడ్డిలో పెరిగిన చిన్న మొక్కలకు అక్కడక్కడా పూచిన పూలను సీతాకోక చిలుకలు పలుకరిస్తున్నాయి. పైన ఎండ చురుక్కు మంటోదే అనుకునేంతలో సూర్యుణ్ణి మబ్బు కమ్మేసింది. చల్లటి గాలి వచ్చి పలకరించి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ తనతో పాటు నన్నూ నా బాల్యానికి తీసుకు వెళ్లింది.అక్కడా ఇదే ప్రకృతి. కానీ ఇంత కంటే ఎక్కువచెట్లు. బిల్డింగులు తక్కువ. కాస్త పల్లెటూరు. కావలసినంత ఖాళీ ప్రదేశం. ఖాళీ స్థలాలలో పెరిగే సీతమ్మవారి జడ మొక్కలు. ముట్టు కుంటే ముడుచుకునే మొక్కలు.. ఇలా రకరకాలు. వర్షాకాలం వెళ్తోందంటే పూల పొందుకై పరుగులు పెట్టే సీతాకోక చిలుకలు రకరకాల చీరలు కట్టేవి. చేతికి చిక్కకుండా మోజును మరింత పెంచేవి. ఆడ పిల్లలు పూలను కోసి ముక్కుపుడకల్లా పెట్టుకుని ఎలా ఉంటామోనని చూసుకునే వారు. గాలి పటాలతో , గోటీ బిళ్లల తో రోజంతా గడిపే వాళ్లం.


ఏదో గువ్వపిట్ట అరుపుతో ప్రస్థుతానికి వచ్చాను. ఇక్కడా అదే అనుభూతి కలుగుతోంది. అనుభూతి సామీప్యం వల్లనేనేమో చిన్నతనపు రోజులు గుర్తుకు వచ్చాయి. కంటికి కనిపించే దాంట్లో ఇప్పటికీ, నా బాల్యానికీ చాలా వ్యత్యాసం ఉంది. కానీ కలిగే అనుభూతిలో మాత్రం తేడాలేదు. అంతే ఆనందం, అదే ఉత్సాహం.

ప్రక్క డాబాపై వాలిన పావురాలు గువ గువ మంటూ శబ్దం చేస్తున్నాయి. దూరంగా ఉన్న గుడిసెల దగ్గరి పిల్లవాడు. తనకంటే చిన్న పిల్లని ఎత్తుకుని పరుగులు పెడుతున్నాడు. ప్రక్కనే ఉన్న ఆల మందలో నుండి దూడ ఒకటి తోక పైకి మడిచి గెంతుతూ పరిగెడుతోంది. గాలి కొత్త ఊసులేవో మోసుకొస్తోంది. ఇసుకలో మొలిచిన రెండు మొక్కలు ఒకదానిపై ఒకటి వాలి గుస గుసలాడుతున్నాయి. నాలో నిద్రించిన మదిని మేలుకొలుపుతున్నాయి.

" ఆనందం అప్పుడూ ఇప్పుడూ ఎప్పూడూ ఉంది, ఉంటుంది.. దాన్ని గ్రహించే మనసు మనకుంటే అది ఎప్పటికీ మనసొంతం "


అప్పుడప్పుడూ నాకు చేసే పనులన్నీ చిరాకనిపించి వాటికి కొంత విరామమిచ్చి, కొత్తగా ఏదైనా మొదలు పెడుతుంటాను. రోజులు అన్నీ ఒకేలా గడపడం నాకిష్టం ఉండదు. అలాగని రోజుకో కొత్త జీవితం కోరుకోను. చేసే పనులే కొత్త రకంగా చేస్తాను. లేదా కొత్త పనులు ప్రారంభిస్తాను. అలా ప్రారంభించిన వాటిల్లో బ్లాగు రచనావ్యాసంగమూ ఒకటి. నేను రాసే వాటికంటే తోటి బ్లాగరుల రచనలు చదివేవే ఎక్కువ. కుదిరినప్పుడల్లా బ్లాగుల లోక మంతా తిరుగుతుంటాను. ఒక్కో బ్లాగూ నాకు ఒక్కొ కథ చెప్తూ ఉంటుంది. ఆనంద నందనాలు కొన్నైతే, జ్వలించే హృదయాలు కొన్ని. కొన్ని కాలక్షేపం కబుర్లు చెప్తాయి. కొన్ని కన్నీటి కథలు చెప్తాయి. మరికొన్ని విఙ్ఞానాన్నిస్తాయి. అలా అలా పలకరిస్తూ , తోచిన వ్యాఖ్యలు రాస్తూ ఉంటే ఏదో ఆనందం. ఎవ్వరూ స్నేహితులుగా లేని ఖాళీ బ్లాగుని చూస్తే నాకు అలా వదలబుద్ధికాదు. బ్లాగుకు నేనే మొదటి స్నేహితుడినవ్వాల్సిందే. అదో తృప్తి. :):)

ఇలా ఆనందం కోసం చేసే బ్లాగు రచన కూడా ఒక్కోసారి ముందుకు సాగనంటుంది. దానికి కారణం ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని, కూర్చొని విసుగెత్తడం కావచ్చు. అప్పుడప్పుడూ ఎక్కువయ్యింది అనిపించి కాస్త కంప్యూటర్ కి దూరంగా కొన్నాళ్లుంటాను. నా పనుల మీద దృష్టి పెడతాను. మళ్లీ కొత్త ఉత్తేజంతో మొదలు పెడతాను.


ఇలా కంప్యూటర్ ని కాస్త అదుపులో పెట్టిన రోజుల్లో సారి మా డాబా మీదికి ఎక్కి కూర్చుని చుట్టూ ప్రకృతిని పలకరించే ప్రయత్నం చేశాను. ఎందుకో నాకు తెలియకుండానే మనసు చాలా ఆనందంతో నిండి పోయింది. షో అన్నట్లు " ఆనందం అనేది నువ్వు వెతికితే దొరికేది కాదు. దానంతట అది నీకు ఎప్పుడైనా కలుగ వచ్చు. అది ఓ చెట్టుకింద నువ్వు కూర్చున్నప్పుడు కూడా కావచ్చు. "

26 వ్యాఖ్యలు:

 1. చాలా బాగా రాశారు..
  కళ్ళ ము౦దు అన్ని సజీవ౦గా చూపి౦చారు. నేను మీ డాబా మీద ను౦చి విశేషాలు అన్ని చూశాను..
  ఆడపిల్లలు ముక్కుపుడక పెట్టుకు౦టున్నారు అని రాశారు.అవును నేను చిన్నపుడు పెట్టుకునేదాన్ని.ఆ మొక్కని ఒయ్యరిభామా మొక్క అనేవాళ్ళా౦ ,ఆ పువ్వు నక్షత్ర ఆకార౦ లో ఉ౦డేది.మరేదైనా పేరు ఉ౦దేమొ నాకు తెలియదు.
  "ఆన౦ద౦ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉ౦ది ,ఉ౦టు౦ది ఈ మాట అక్షరసత్య౦.దాన్ని అ౦దుకునే అర్హత మనకు౦టే అన్నారు మీరు , ఆ అర్హత అ౦దరికి ఉ౦టు౦ది అనుకు౦టున్నాను కాని పొ౦దే మనస్సు ఉ౦డాలి నా ఉద్దేశ్య౦.
  మొదటిసారి మీ బ్లాగుకి వచ్చాను .మ౦చి ఆతిద్య౦ ఇచ్చారు.దన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సుభద్ర గారు నా " బృందావనంలో..." కి స్వాగతం సుస్వాగతం. :)
  మీకు కూడా కళ్ల ముందు అన్నీ కనిపించాయంటే నా రచన సార్ధకత చెందినట్లే..

  మిరన్నట్లు అది గ్రహించే మనసుండాలనే నా ఉద్దేశం కూడా.. కానీ రాయడంలో అలా పరిణామం చెంది, అర్హత అని మారింది. ఇప్పుడే మర్చేస్తున్నాను. ధన్యవాదాలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. విశ్వప్రేమికునికి విశ్వమంతా ఆహ్లాదంగానే ఉంటుంది కదా!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అంతా కళ్ళ ముందు జరుగుతునట్లు, నేనే అలా చూస్తునట్లు అనిపించింది.
  ఆ చల్లటి గాలి నన్నూ నా బాల్యానికి తీసుకువెళ్ళింది. గాలిపటాల రెపరెపలూ వినిపించాయి.
  ఇంకా ఆ అనుభూతులూ మెదులుతూనే ఉన్నాయి.
  మీ రచన మదిలో దాగిన జ్ఞ్యపకాలను నిద్రలేపి, పరవశింపచేసింది. నాలోని సంతోషిని గ్రహింప చేసింది.

  నేనూ మీ లాగే తోటి బ్లాగరుల రచనలు ఎక్కువగా చదువుతుంటాను. ఎంతో నేర్చుకుంటున్నాను.
  మీరు చెప్పినట్లు ఒక్కో బ్లాగూ ఒక్కో కథ చెపుతోంది. రకరకాల భావోదేగ్వాలు కలిగిస్తోంది.

  /* ఎవ్వరూ స్నేహితులుగా లేని ఖాళీ బ్లాగుని చూస్తే నాకు అలా వదలబుద్ధికాదు. ఆ బ్లాగుకు నేనే మొదటి స్నేహితుడినవ్వాల్సిందే. అదో తృప్తి */
  ఈ మాటలను (భావాన్ని) నేను ఎప్పటికి మర్చిపోలేను. మీ తృప్తి లో పులకిన్చినవాడిని నేను. ఆనందమే కాదు, మీ మనస్సు ప్రోత్సాహం కూడా ఇచ్చింది. ఇంకా ఎంతో నేర్పింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. >>ఆనందం అనేది నువ్వు వెతికితే దొరికేది కాదు. దానంతట అది నీకు ఎప్పుడైనా కలుగ వచ్చు. అది ఓ చెట్టుకింద నువ్వు కూర్చున్నప్పుడు కూడా కావచ్చు. "
  చాలా బాగా రాసారు.. పోస్ట్ అంతా ఆహ్లాదం గా ఉంది అండి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మిత్రమా సుభద్ర గారి మాటే నా మాట
  ఫణి గారు కూడా నే చెప్పాలను కున్నది చెపేసారు..
  "సీతమ్మవారి జడ మొక్కలు" ఇవి మా ఇంట్లో ఉన్నాయ్ వీటిని మేము "సీతమ్మ వారి జడ కుచ్చులు అంటాం...:)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చాలా చక్కటి ఆహ్లాదకరమైన పోస్టు. టపా చదవకుండా ఓ ఐదు నిముషాలు ఫోటోలు చూస్తూ కూర్చున్నాను.బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. కళ్ళుమూసుకొని క్షణాల్లో మీ ప్రపంచమంతా చుట్టి వొచ్హాను. తనివి తీరటం లేదు. ఎలా! ఇటువంటి లోకమే ఎప్పటికీ కావాలి. కాని వీలవ్వదే. మనం ఆనందాన్ని ఎక్కడైనా వెతుక్కోవచ్చు. ఎవరి ప్రపంచంలో వారి ఆనందం. కాని ప్రపంచమే మరచిపోవాలనుంది. అలా...అలా...సీతాకోక చిలకనై, చిన్న జీవితమే అయినా...ఆ త్రుప్తి అనుభవిస్తే చాలదా...

  ప్రత్యుత్తరంతొలగించు
 9. చీమలకూరు విజయ మోహన్ గారు: ఏదో అంతా మీ అభిమానం. మీరు మరీ అలా పొగిడేస్తే అయ్యబాబోయ్ చిగ్గేత్తోందండీ...! :):)

  ఫణి గారు: ధన్యవాదాలండీ. మీరచనల కోసం ఎదురు చూసే ఓ మితృడు ఉన్నాడని మరువకండి మరి.. :)

  నేస్తం గారికీ, మితృడు కార్తీక్ కీ నా భావుకత నచ్చినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. సునీత గారు: అవునా నా టపాకంటే అక్కడి ఫోటోలే ఎక్కువ బావున్నాయా... :(

  సరదాకన్నాను. మీకు టపాకూడా నచ్చిందని అర్థమైంది. ధన్యవాదాలు.

  జయ గారు: వావ్ మీకూ నాకున్నంత భావుకత ఉందండీ.

  ఇది ఎంతమందికి నచ్చుతుందో అనుకుంటూ రాశాను. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ భావుకత కలిగినది. అందులోనూ ఇది కేవలం ప్రకృతి వర్ణన మాత్రమే. ఈ విధమైనది చాలా మందికి నచ్చదు. కానీ మన బ్లాగరులలో చాలా మంది లోతైన భావుకతని ఇష్టపడతారు అని ఈ టపా నాకు తెలిపింది. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. బాగుంది అండి.. మొత్తానికి కాలాలను అనుభూతులను చుట్టబెట్టి వచ్చారన్నమాట. బాగు బాగు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. విశ్వప్రేమికుడుగారూ!
  మీరు పెట్టుకున్న పేరు మీకు సరిగా సరిపోయిందండి.
  అనుభూతి చెందే మనసు ఉంటే సమస్యలో, వత్తిళ్ళో అడ్డు రావు కదూ!
  బాగా వ్రాస్తారు మీరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. బృందావనమిది అందరిదీ ...అంటూ ప్రకృతి అందాలను మాకందరికీ పంచుతున్న మీకు thanks!పోస్ట్ చాలా బాగా రాసారు.అన్నట్టు సీతాకోక చిలుకలంటే నాకు చాలా ఇష్టమండీ .....ఫోటో చాలా చాలా బావుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మీతోపాటు ,మీ ఇల్లు ,చుటుపక్కల ప్రదేశాన్ని కళ్ళకు కట్టినట్లు చుపించేసేరు .చదువుతుంటే చాల ఆహ్లాదంగా ఉంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 15. నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమున అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మధవునిలా...చాలా చాలా బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అందరికీ ధన్యవాదాలు.

  పరిమళం గారు : సీతాకోక చిలుకలమీద టపాకూడా రాశారుగా. :)

  శివ చెరువు గారు : మీ ఫోటో ని చూస్తే అర్థమవుతోందండీ... ఆ పచ్చదనమే చెప్తోంది. :)

  వంశీ కృష్ణ గారు స్వాగతం.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. అంతర్జాతీయ తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. రాధ హ్లాదినీ శక్తి . రాధను నేనే అనిభావలోకం లోకి వెళ్ళారంటె ఇక అంతా ఆహ్లాదమే .వచ్చే ప్రతిపలుకు ఆనందమే ,

  ప్రత్యుత్తరంతొలగించు
 19. ఇక నుండీ అప్పుడప్పుడూ మాత్రమే వస్తాను మిత్రమా. నాకు కాస్త పనులున్నాయి.

  కానీ మీ బ్లాగులు చూడడం ఆపను. :)

  ధన్యవదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
  "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
  కోసం ఈ కింది లంకే చూడండి.
  http://challanitalli.blogspot.com/2009/12/2009.html

  ప్రత్యుత్తరంతొలగించు