About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

8, జూన్ 2009, సోమవారం

మౌనమే నా భాషగా...


కంటికి కనిపిస్తున్నదే నిజం కాదు
ఈకాలం ఆటలాడనిదే ఊరుకోదు అలాఅని
ఈ క్షణం ఇలాగే కదలక నిలచిపోదు

నువ్వు కాదన్నావని తెలుసు కానీ...
నిన్ను చూడనిదే నిదురపోదే ఈ పాడు మనసు!
అరే..! నీమీద కోపమైనా రాదే..!?
నీ నుండి దూరంగా వెళదామంటే...

అవునని చెప్పలేక కాదని నన్ను కలత పెట్టలేక
ఆ రోజు బాధపడ్డావని తెలిసినప్పుడు....
పగిలిన అగ్ని పర్వతం నాలో ఇంకా ఆరలేదే..

నీ కంట తడిని గానీ, మనసు అలజడిని గానీ
తట్టుకునే శక్తి నాకిక లేదు అందుకే...
మాట పడని నేను మాట్లాడ లేని స్థితిలో ఉన్నాను
తలవంచని నేను తలతిప్పుకు వెళుతున్నాను నీకోసం...

పడిన చోటనే అలా ఉండలేను
పోనీ లేచి నీ వైపుకు నడవ లేను
నిన్ను మరచి మరో వైపు చూడలేను

ఎంతో చెప్పాలని ఆవేదన, ఏదో చెయ్యాలని ఆరాటం
ఒప్పించడం కష్టం కాదు, మెప్పించడం అంతసులువైనది కాదు
ఏం చేసినా అది మళ్లీ నిన్ను బాధ పెడుతుందేమో..
అని ఆగిపోతున్నాను.. నాలో నేను మిగిలిపోతున్నాను...

ఇది ఓటమి కాదని తెలుసు... ప్రేమకి
ఓటమి లేదని తెలుసు... ఆ గెలుపు మార్గమే..
తెలియక సతమతమవుతున్నా...
గెలవలసింది నిన్ను కాదని
నన్నునేను గెలిచినప్పుడే
నీ మనసు గెలవగలనని తెలిసింది...
అది తెలిసిన నాటి నుండీ...
ఆవేదన లేదు... ఆరాటమూ లేదు...

నీవు దక్కితేనే నా ప్రేమ జయిస్తుంది
అనే పిచ్చి భ్రమలో లేనిప్పుడు...
వెర్రి బాధలో మునిగి లేనిప్పుడు
మౌనమే నా భాషగా...
మనసే గురువుగా...
నీవే నా దేవతగా...
ప్రేమ తపస్సులో మునిగి పోతున్నా..
నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నా...



ఆనందాన్ని పంచేదే ప్రేమ కానీ...
బాధను పెంచేది నిజమైన ప్రేమ కాదు... :)

3 కామెంట్‌లు: