About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

బ్లాగు లోకంలో కాకులు ప్రవేశించాయట..!



నేను బ్లాగు ప్రారంభించి నెలరోజులు అయినట్లుంది. నేను ప్రారంభించేనాటికి ఏ బ్లాగుని తెరిచినా సాదరంగా ఆహ్వానించేవారు. తమ మనసును అందంగా మన ముందు పరిచేవారు. కొందరు తమ రచనలతో చక్కటి సౌరభాలను వెదజల్లితే, కొందరు దారంతా మల్లెలు పరిచేవారు. తమ ఆనందాన్నైనా, చుట్టూ ఉన్న ప్రపంచంలోని బాధలనైనా హృద్యంగా వ్యక్త పరిచేవారు. ఎవరు ఏది చెప్పినా, ఎలా పలకరించినా ఒక అందం కనపడేది. బ్లాగరులు విభిన్న దృక్పధాలు కలిగిన వారు. ప్రతి ఒక్కరికీ ఓ వైవిధ్యత ఉంది. కానీ కొంచెం తరచి చూస్తే ఈ కధనాలన్నిటి వెనుకా ఏకసూత్రత కనిపిస్తుంది. తమకు తోచిన మంచిని నలుగురికీ చెప్పాలి అనే ఆతృత ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఆ ఆరాటం నాకు చాలా చాలా నచ్చింది.
తెలుగుకు కాలం చెల్లింది అని అన్నవారి భ్రమలు పోగొట్టే విధంగా అంతర్జాలంలో ఓ వెలుగును నింపుతున్న వీరందరూ మహా పండితులు కాక పోవచ్చు. కానీ "వారు రాసే ప్రతి అక్షరం చరిత్రను లిఖిస్తోంది. చెప్పే ప్రతి మాటా భవిష్యత్తును ప్రశ్నిస్తోంది." వీరి లక్ష్యం ఒక్కటే. తమ మనో భావాలను నలుగురితో పంచుకోవాలనే. దానికి ఆ నలుగురి స్పందన చూడాలనే. అంతే... అంతకంటే ఎక్కువేమీ ఆశించలేదు ఎవ్వరూ. అందుకే ఈ బ్లాగులు నాకు చాలా బాగా నచ్చాయి. కొత్తగా రాసే వారి దగ్గరనుండీ, ఎంతో అనుభవం ఉన్నవారి దాకా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేనూ ఉడతా భక్తిగా ఏదో ఒకటి ప్రారంభిద్దాం అనుకున్నాను. ఉత్సాహంతో బ్లాగు తెరచాను.
కానీ ఈ నెలలో పరిస్థితులలో కాస్త మార్పు వచ్చింది. ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆహ్వానించే కొందరు బ్లాగరులు కొత్తగా బ్లాగులోకి ప్రవేశించడానికి కొన్ని షరతులు పెట్టారు. మరి కొందరు బ్లాగులని మూసివేయాలి అనుకోవడం కూడా అక్కడక్కడా వినిపిస్తోంది. ఇందుకు కారణం "బ్లాగు లోకం లోకి కొన్ని కాకులు ప్రవేశించాయట..! పేరులేని ఈ కాకులు ప్రతి బ్లాగులోకీ ప్రవేశించీ నోటికొచ్చిన కారు కూతలు కూస్తున్నాయట..!" ( నువ్వూ సొంత పేరు చెప్ప లేదు కదా!? నువ్వూ ఆ కాకుల గుంపులో ఒకడివా..? అంటారేమో... ఎంత మాత్రమూ కాదండోయ్.. `మచి పని చెయ్యడానికి పేరుతో పనేముందీ' అనుకునే తత్వం నాది. `ముసుగులో ఉంటే ఏమైనా చెయ్యొచ్చూ' అనే తత్వం వారిదీ.) ఇంతకీ ఏ కారుకూతా నేను ప్రత్యక్షంగా చూడలేదు. తప్పొప్పులు ఎవరివి ఎంతో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం స్పష్టమైంది. "కొందరి రాతల వల్ల మరికొందరికి మనస్థాపం కలిగింది. అది అంతటితో ఆగక ప్రతి బ్లాగులో చర్చనీయాంశం అయ్యింది." ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే ఈ బ్లాగులు ఎవరి కారుకూతల వల్లో మూతపడతున్నాయంటే బాధ వేసింది. ఆంతటి అనుభవజ్ఞులే కాకుల గోలకు తల్లడిల్లు తున్నారే... రేపు ఆ పరిస్తితి మాబోటి పిల్లకాయలకి ( కొత్తవారికి) ఒస్తే..? అనే అనుమానం వచ్చింది. కాబట్టి మాకు మార్గం చూపడం కోసమైనా వీరు బ్లాగులని కొనసాగించవలసిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి మనం. ఆ కాకులకీ మనసనేది ఉంటుంది. ఇప్పుడు కాకపోతే మరో రోజు తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడతారు. పశ్చాత్తాపం బండరాయిని కూడా కరిగిస్తుంది. వారుకూడా మరో మంచిపనుకి పూనుకునేలా చేస్తుంది. ఆ రోజు వస్తుందని ఆసిద్దాం. ఇక మనస్థాపం కలిగిన బ్లాగరులు ఈ పరిస్థితిని కూడా తమ విజయానికి బాటగా మలచుకో గలగాలి. వారి మాటలు ( నిజమైనా, అబద్దమైనా) కూడా మనకి కొన్ని పాఠాలు నేర్పొచ్చు. నిజాయితీగా ఆ పాఠాలు ఏమిటో గ్రహించి ముందుకు సాగిపోవడమే తెలివైన పని.
మన మనసులో భావాలు ఇతరులకి బాధ కలిగించ కుండా ప్రదర్శించడం ప్రతీ బ్లాగరూ నేర్చుకోవలసిన కళ. ఒక వేళ మంచి చెప్పవలసి వచ్చినా నొచ్చుకోకుండా చెప్పడం విజ్ఞత అనిపించుకుంటుంది. ఏది ఏమైనా ఈ రచనలు చేయాలనుకునే వారికి కాస్త మనస్సాక్షి ఉంటుందని నేను నమ్ముతాను. దానికి కట్టుబడి ఉందాం. మన రచనల ద్వారా మంచి జరగక పోయినా ఫర్వాలేదు, చెడు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క రికీ ఉంది. ఆ దిశగా అందరం ప్రయత్నిద్దాం. ప్రేమికుడు :)

15 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారండీ.... చూద్దాము ఎవరిలో ఎంత వరకూ మార్పు వస్తుంది అనేది

    రిప్లయితొలగించండి
  2. బ్లాగు వ్యక్తిగత అభివ్యక్తికి వేదికైతే,బయటి ప్రపంచానికి ఒక మినీరూపం బ్లాగుసమాహారాలూ,సంకలినులు.బ్లాగులో ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది.కానీ,కూడలి లేక జల్లెడకొచ్చాక అదొక "సంఘం"లాగా మారి సమస్యలొస్తాయి. అది తప్పదు. అందుకని బ్లాగులు రాయటం సమస్య కాకూడదు. ప్రపంచం కోసం మనం మన వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టకూడదు కదా!

    రిప్లయితొలగించండి
  3. ప్రేమికుడు గారు బాగా చెప్పారు..
    కారు కూతలు కూసినా మనం రాయడం ఆపకూడదు.
    ఎవరి అభిప్రాయం వారిది.ఇక్కడ సమస్య అభిప్రాయ భేదాలు మాత్రమే, బ్లాగులు కాదు.మనం ఇంకా మంచిగా మన బ్లాగుని ముందుకు తీసుకెళ్లాలి..

    రిప్లయితొలగించండి
  4. ఉదాసీనంగా అయిపోయిన వారందరినీ ఆప్యాయంగా తట్టిలేపే ప్రయత్నం
    చేశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. బావుంది .

    కాకి కూసే కూత కారు కూత ఎలా అయ్యింది? ఏ సమాసం? మరియు సంధి ఏమిటి?
    నేను తెలుగు మాష్టార్ని తప్పు చెపితే బెత్తం తీస్తా .( వుత్తుత్తినే.........)

    రిప్లయితొలగించండి
  6. మీ చివరి పేరా అందరికీ అనుసరణీయం.

    ఈ గొడవలన్నీ ఇక్కడ మామూలే. ఈ సారి కాస్త మసాలా ఎక్కువై దారిన పోయే వాళ్లకీ ఆ ఘాటు తగిలిందంతే. చూస్తుండండి, మరో వారం పది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. మళ్లీ ఒకట్రెండు నెలల్లో మరో గొడవొస్తుంది. మనం తెలుగు వాళ్లం .. ఆ మాత్రం సందడి లేకపోతే ఎలా? :-)

    రిప్లయితొలగించండి
  7. నమస్కారం,

    బ్లాగ్ లోకంలో మాత్రమే కాదు- ప్రతి వ్యవస్థ/సంస్థ లోనూ మంచి చెడూ వుంటాయి. మనం దేనిని ఎంచుకున్నామన్నది ముఖ్యం. అభిప్రాయ బేధాలు వుండటంలో తప్పు లేదు కానీ వాటితో విభేదించేటప్పుడు భాష కాస్త నాగరికంగా వుండాలి. అవి కొన్ని బ్లాగులలో/ బ్లాగరులలో లోపించింది. అందువల్లే ఆ మధ్య కాకుల కూతలు వినిపించాయి--- పరిస్థితి సద్దుమణిగింది.
    కాబట్టి మళ్ళీ కోయిల స్వరాలు వినగలమన్న ఆశతో ముందుకు సాగుదాం.

    భవదీయుడు,

    సతీష్ కుమార్ యనమండ్ర

    రిప్లయితొలగించండి
  8. ఇంత తొందరగా స్పందించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలండీ...
    @లలిత గారు: అవునండీ కాకి కూస్తే అది కాకికూత అవుతుంది కదా..? ఈ తప్పు కాయండి మాష్టారూ... ఇకపై సరిగ్గా నడుచుకుంటా.. :)

    రిప్లయితొలగించండి
  9. బ్లాగులోకానికి వివాదాలు కొత్త కాదు. ఎలా వచ్చాయో అలానే సమసిపోయాయి. ఇవికూడా అంతే.

    @లలితగారు: పాపం పిల్ల కాకిని అంటున్నాడుగా వదిలేయండి ఈసారికి.

    రిప్లయితొలగించండి
  10. @లలిత:

    కారు కూసే కూత కారు కూత, అంటే car horn అన్న మాట. అలాగే బస్సు కూతలు, రైలు కూతలు వగైరా....

    రిప్లయితొలగించండి
  11. "తమ మనో భావాలను నలుగురితో పంచుకోవాలనే. దానికి ఆ నలుగురి స్పందన చూడాలనే. అంతే... అంతకంటే ఎక్కువేమీ ఆశించలేదు ఎవ్వరూ" ఇది నిజ్జంగా నిజమండీ !మా అందరి మనసుల్లోని భావోద్వేగాల్నీ చక్కటి అక్షర రూపమిచ్చి మాముందుంచి నందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  12. ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే ఈ బ్లాగులు ఎవరి కారుకూతల వల్లో మూతపడతున్నాయంటే బాధ వేసింది. ఆంతటి అనుభవజ్ఞులే కాకుల గోలకు తల్లడిల్లు తున్నారే... రేపు ఆ పరిస్తితి మాబోటి పిల్లకాయలకి ( కొత్తవారికి) ఒస్తే..? అనే అనుమానం వచ్చింది. కాబట్టి మాకు మార్గం చూపడం కోసమైనా వీరు బ్లాగులని కొనసాగించవలసిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి మనం. ఆ కాకులకీ మనసనేది ఉంటుంది. ఇప్పుడు కాకపోతే మరో రోజు తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడతారు. పశ్చాత్తాపం బండరాయిని కూడా కరిగిస్తుంది. వారుకూడా మరో మంచిపనుకి పూనుకునేలా చేస్తుంది. ఆ రోజు వస్తుందని ఆసిద్దాం. ఇక మనస్థాపం కలిగిన బ్లాగరులు ఈ పరిస్థితిని కూడా తమ విజయానికి బాటగా మలచుకో గలగాలి. వారి మాటలు ( నిజమైనా, అబద్దమైనా) కూడా మనకి కొన్ని పాఠాలు నేర్పొచ్చు. నిజాయితీగా ఆ పాఠాలు ఏమిటో గ్రహించి ముందుకు సాగిపోవడమే తెలివైన పని.
    ee point exlent sir
    pavankalyanias.blogspot.com

    రిప్లయితొలగించండి
  13. ప్రేమికుడు గారు..
    బ్లాగుల్లొ కాకి(కారు, బస్సు ,రైలు) కూతలు సహజం. అభిప్రాయాల వెదిక కాబట్టి అలాంటివి తప్పదు అప్పుడప్పుడు. @ మురళి గారు చెప్పినట్టు
    'బ్లాగులోకానికి వివాదాలు కొత్త కాదు. ఎలా వచ్చాయో అలానే సమసిపోయాయి. 'కాకి కూతలు కూసె వారిని క్షమించి ఇంకా ప్రేమిద్దాం (మీరు చెప్పినట్టు).అప్పుడైనా వారిలో మార్పు వస్తుందేమో.
    @ సతీష్ గారు చెప్పినట్టు 'అభిప్రాయ బేధాలు వుండటంలో తప్పు లేదు కానీ వాటితో విభేదించేటప్పుడు భాష కాస్త నాగరికంగా వుండాలి.'ఇది గుర్తించిన నాడు ఏ కాకి(కారు, బస్సు ,రైలు) కూతలు వుండవు..

    రిప్లయితొలగించండి