About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

23, జనవరి 2009, శుక్రవారం

ప్రేమ లేఖ రాశా...

ప్రేమ లేఖ రాశా అది అంది వుంటదీ... పూల బాణ మేశా యద కంది వుంటదీ... అని సాధారణంగా ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సంధర్భంలో పాడుకునే ఉంటారు. పాట పాడక పోయినా ప్రేమ లేఖ అయినా రాసి ఉంటారు. నేను నా పదవ వ తరగతి లోనే(10 సం. ల క్రితం) రాశాను. నా కోసం కాదు లెండి. కానీ ఆ ప్రేమ లేఖ రాసిన సందర్భమూ, అప్పట్లో ప్రేమ గురించి నా ఆలోచనలూ చాలా సరదాగా ఉంటాయి. అందుకే మీ ముందుంచుతున్నాను. విందారగించండి మరీ.....
మా ఊరు నా చిన్నప్పటికి చాలా చిన్నగా ఉండేది. అందువల్ల ఊర్లో యే చిన్న విషయం జరిగినా క్షణాల్లో గుప్పు మనేది. అందులో ప్రేమ విషయాలైతే వేడి వేడి మిర్చి బజ్జీల్లాగా యమా ఫాస్ట్ గా పాకి పోయేవి. దాని మీదుండే శ్రద్ధ అలాంటిది మరీ... కొంత మంది ప్రేమికులు ఇంట్లోంచి పారి పోవడం, మరి కొందరు చనిపోవడం కూడా నాకు బాగా గుర్తు. అందరూ ఆ ప్రేమికుల్ని తిట్టుకోవడమో.., వారి తల్లి దండ్రుల పెంపకానికి బుగ్గలు నొక్కుకోవడమో... చేసేవారు. ఇవన్నీ చూసి నాకు ప్రేమంటే భయం, కాస్త చిరాకు, కాస్త శ్రద్ధ ఇలా రకరకాల భావాలు ఉండేవి. మా తరగతి అబ్బాయిల్లో నేనే చిన్న వాడిని. కానీ చదువులో నేనే మొదట ఉండేవాడిని. అందుకే మాష్టర్లు అందరికీ నేనంటే ఇష్టం. నా మంచి నడవడికి మెచ్చి ఉత్తమ విధ్యార్థి గా ఓ మెడల్ కూడా ఇచ్చారు. అయితే చుట్టూ జరిగే పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడంలో నేను కాస్త నెమ్మదే అని చెప్పాలి. నా పనేదో నాదే. అందుకే పెద్ద వాళ్లు నన్ను తెలివైన, బుద్ది మంతుడైన పిల్లవాడిగా చూస్తే, నా తోటి వారు నన్నో అమాయకుడిగా చూసేవారు.వాళ్లకేదో ప్రపంచమంతా తెలిసినట్టు నన్ను చిన్న చూపు చూసేవారు. నాకు తెలియంది వాళ్లకు తెలిసిందీ ఏమిటో అర్ధమైయ్యేది కాదు. ఎలాగైనా దాని గురించి పరిశోధించి వాళ్లకంటే నాలుగాకులు ఎక్కువ చదివాననే పేరు సంపాదించాలనే కోరిక నాలో క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. నాకు తోడు వీరు అని ఒకడుండేవాడు. వీడూ నేనూ ఒకే రోజు వొకే సం.రం 2. 30 గం.ల తేడాలో పుట్టాము. విచిత్రం వాడికీ నాకూ ఏది జరిగినా ఒకేలా జరిగేది. మేమిద్దరం పదవ తరగతికి వచ్చినా మోకాలు పై వరకూ వున్న నిక్కరులే వేసుకునే వారం. మా సైన్స్ మాష్టారు మమ్మల్ని " వొరేయ్ ఇంకా ఆ నిక్కరులేంటిరా... ఫ్యాటు లెయ్యండిరా... లేక పోతే అమ్మాయిలు ఎత్తుకు పోతారురా..." అనేవారు. క్లాసులో వాళ్లందరూ నవ్వేవారు. మాకేమీ అర్ధమయ్యేది కాదు. కోపం కూడా వచ్చేది. మాష్టారు అన్నందుకు కాదు, వాళ్లు నవ్వినందుకు. మా తరగతిలో ప్రియ (పేరు మార్చాను) అనే అమ్మాయి వుండేది. చాలా చలాకీ అయిన పిల్ల. అందరి తోనూ స్నేహంగా వుండేది. నాతో కాస్త ఎక్కువగా వుండేది.( ఏం వెతక్కండి. అక్కడేమీ లేదు. :-) ) చదువులో మా ఇద్దరికీ మంచి పోటీ వుండేది. ఒకసారి సుజాత అనే అమ్మాయి నన్ను నోట్ బుక్ అడిగింది. నేను లేదు వేరే వాళ్లకిచ్చాను అని చెప్పాను. ఎవరికీ ప్రియకేనా అని ఠక్కున అడిగింది. అరే ఎలా చెప్పావూ..? అని ఆశ్చర్యంగా అడిగాను. నాకు తెలుసూ... నాకు తెలుసూ... అని నవ్వు కుంటూ వెళ్లి పోయింది. వీళ్లిలా మొహం చూసి ఎలా చెప్పేస్తారో అర్ధమవలేదు. మరో సారి మా ఫ్రెండ్ వొకడు " అరెయ్ ప్రియ భలేగా ఉంటుందిరా... నీతో వున్నంత్ స్నేహంగా నాతో వుంటేనా..." అని ఆపేశాడు. ఆ... వుంటే...? అని అడిగా. అదంతే నీకు తెలియదులే... అని వెళ్లి పోయాడు. ఇలాంటివి ఓ ప్రక్క సరదాగా వున్నా, ఓ ప్రక్క భయంగా కూడా ఉండేది. నా చుట్టూ వెయ్యి కళ్లు ఉండి గమనిస్తున్నట్లుగా ఉండేది. ఇలాంటివన్నీ నా దృష్టిని నా చుట్టూ వున్న పరిసరాల మీద లగ్నంచేసేటట్టుగా చేశాయి. మా స్కూల్లో జరిగే ప్రేమాయణాల గురించి అప్పుడప్పుడూ చూచాయగా తెలిసేది. అప్పట్లో తరగతికి మహా అయితే రెండు, మూడు ప్రేమ జంటలు ఉండేవి. వాళ్లు కూడా ఎవరికీ తెలియ కుండా చాలా జాగ్రత్త పడే వారు. కానీ వారి గురించిన పుకార్లు షికార్లు చేసేవి. అన్నీ పరోక్ష కధనాలే.. వొక్కడూ ప్రత్యక్ష సాక్షి ఉండే వాడు కాదు. వొక వైపు వాళ్లని మంచి వాళ్లు కాదని చెపుతూనే, మరోవైపు వో హీరోలా చూసే వాళ్లం. వాళ్ల ధైర్యానికి ఆశ్చర్య పడే వాళ్లం. ఈ ప్రెమలో పడ్డ వాళ్లు మిగతా వారిని ఏమీ తెలియని అమాయకుల్లాగ చూసేవాళ్లు. ప్రేమించే ఆలోచన (ధైర్యం) నా కెప్పుడూ లేదు. కనీసం ప్రేమ గురించి తెలుసుకుని తెలివి గల వారి ప్రక్కన నేనూ తలెత్తుకు తిరగాలని నా సంకల్పం. నాకు వీరూ గాడు తోడు. ఇద్దరం ప్రేమ గురించి తెలుసుకోవాలనుకున్నాం. అనుకున్నాం సరే... కానీ ఎలా తెలుసుకోవాలీ..? అదే అర్ధం కాలేదు. ఈ ప్రేమికులు సాయంత్రాల్లో పార్కుల దగ్గరా, గుడి దగ్గరా, చెట్లెమ్మటా, పుట్లెమ్మటా తిరుగుతున్నారనీ.., అలా కలుసుకోవడానికి ప్రేమ లేఖల ద్వారా సమాచారం అందుతుందనీ విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది. ఇక ఎక్కడికి వెళ్లినా ఓ కన్ను చెట్ల మీదా, గుడి మెట్ల మీదా పడేసే వాళ్లం. ఎక్కడా ఓ పట్టాన కనిపించేవారు కాదు. ఇక ఇలా కాదు, వీళ్లని కనుక్కోవాలంటే ఆ ప్రేమ లేఖలు సంపాదించాలి అనుకున్నాం. అనుకోగానే అవి దొరికితే ఇంకేముందీ..? అవి వాళ్లు చదివిన తరువాత పుస్తకాల్లోనూ, తరగతి గోడల కన్నాల్లోనూ, కూర్చునే బెంచ్ సందుల్లోనూ పెడతారని తెలుసుకున్నాం. వాటిలో అసలు ఏం రాసుకుంటారో తెలుసుకోవాలని వొకటే ఆతృత అవసరం ఉన్నా లేకపోయినా ప్రేమికులని అనుమానం వున్న వాళ్ల పుస్తకాలు ఒకటికి పది సార్లు అడిగి తీసుకునే వాళ్లం. గోడల కన్నాలన్నీ మా వెతుకులాటలో మరింత పెద్దవయ్యేవి. వొక్కోసారి ఎవడైనా దాస్తాడేమో అని మేమే కన్నాలుకూడ పెట్టే వాళ్లం. తెల్లగా కాగితం ముక్క కనపడితే చాలు ఆత్రంగా చూసేవాళ్లం. వాళ్లు మాకంటే నాలుగాకులు ఎక్కువే చదివారు. ఎక్కడా దొరకనిచ్చేవారు కాదు. ఎప్పుడైనా ఒక ప్రేమ జంట కనపడితే మేము మాట్లాడేది ఆపేసి చెవులు రిక్కించి మరీ వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినే వాళ్లం. వొక్క ముక్క వినబడితే వొట్టు. వొక్కోసారి మాకు వినబడు తోదని అనుమాన మొస్తే వాళ్లు "కా భాష" లో మాట్లాడుకునే వారు. వీళ్లకి ఈ మర్మ కళలన్నీ ఎలా వచ్చాయో తెలిసేది కాదు. అయినప్పటికీ వదల్లేదు. వీళ్లకిన్ని కళలు నేర్పుతున్న ఆ ప్రేమ అంతేమిటో తెలుసుకోవాలని విసుగు లేని విక్రమార్కుల్లా ప్రయత్నించాం. చివరికి ఒక రోజు అదౄష్టం తలుపు తట్టింది. నేను కనులారా చూడని ప్రేమ లేఖని స్వయంగా రాసే అవకాశం వచ్చింది.
మా స్కూల్లో పేరు మోసిన ప్రేమికుడు ఒకడున్నాడు. మాష్టర్లని కూడా లెక్క చేయని వాడి ధైర్యానికి ఆశ్చర్య పోయే వాళ్లం. అలాంటి హీరో (కాదంటే... నేటి సినిమాలు చూడండి) ఒక రోజు ప్రేమ లేఖ రాయమంటూ మా ఇంటికొచ్చాడు. నాకు ఆనందమూ, ఆశ్చర్యమూ ఆగలేదు. మరోవైపు వీడు నా చేత రాయించి, ఏదైనా తేడా వస్తే నన్ను ఇరికించడు కదా అని అనుమానం కూడా కలిగింది. అలాంటిదేమీ లేదనీ... నా కంటే నీ రాత బాగుంటుందనీ... పైగా నీలో కవి లక్షనాలు కనిపిస్తున్నాయనీ (కాస్త పైత్యం వెలగ బెట్టే వాడిని లెండి)... ఇలా కమ్మగా కబుర్లు చెప్పి వొప్పించాడు. వాడు చెప్ప దలుచుకున్నది ఏమిటంటే... ఆ అమ్మాయిని వాడు చూసి మూడు రోజలైందట... తొందరగా దర్శనం ఇవ్వు దేవీ అని రాయాలట... ఆమాత్రం చాలు... మనం రెచ్చి పోడానికి... గుర్తున్నంత వరకూ నేను రాసింది ఇదీ....
ప్రియా...
నీకోసం ఎక్కడని వెతకను... ఎన్నని వెతకను... వీధులన్నీ తిరిగాను...
గుళ్లూ, బళ్లూ, హోటళ్లూ ఇలా ఒక్కటేమిటి... ప్రతీ చెట్టు నీ... పుట్టనీ... అడిగాను నీ ఆచూకీ...
మాకేమి తెలుసంటూ తెల్ల మొఖం వేశాయి...
వెతికి, వెతికీ... అలసి, సొలసి... చెట్టు నీడన కూర్చొని కన్నులు మూసుకున్నాను.
అదిగో అప్పుడు కలిగింది నీ దర్శనం...
నా హృదయ సామ్రాజ్యంలో... బంగారు సింహాసనంపై...
అప్సరసలు సేద తీర్చగా... నావైపే చూస్తున్నావు... అప్పటి నీ అందం ఏమని చెప్పను...

చెలీ...
నీ అధరాలను చూసి గులాబీలు గోల చేయునేమో...
నీ మేని ఛాయకు బంగారం వన్నె తగ్గునేమో...
చంద్రుడు కూడా నీ అందానికి అసూయ పడతాడు కదా...
ఇంద్రుడు సైతం నీ పాద దాసుడవుతాడు కదా...
ఇంతటి నీ అందాన్ని చూసి నా మది ఆగకున్నది...
వేగమే రావే... నా విరహ బాధను దీర్ప...
ఇంద్రుడు... చంద్రుడు... నవ్వొస్తోంది కదా..!? నాక్కూడా... కానీ అప్పుడదే గొప్ప ప్రయోగం అనిపించింది. ఈ ఉత్తరం చదివి వాడేమన్నాడో తెలుసా...? "ఇంత అవసరం లేదురా... ఆ అమ్మాయికి అంత సీన్ లేదు అన్నాడు". నాకు గాలి తీసేసి నట్లయింది. కానీ ఆ అమ్మాయికి మాత్రం తెగ నచ్చేసిందట. అదంతా ఏమో గానీ ఈ ఉత్తరం రాసిన తరువాత ప్రేమ గురించి నాకేదో అర్ధమవుతున్నట్లు అనిపించింది. ప్రేమ గురించి ఎవరో చెప్తేనో, ఎక్కడో చదివితేనో తెలియదనీ... అది స్వతహాగా మనందరి లోనూ ఉంటుందనీ... సందర్భాన్ని బట్టి తగినంత వ్యక్త పరుస్తూ ఉంటామనీ అర్ధమైంది. ఇదే నేను రాసిన మొట్ట మొదటి, చిట్ట చివరి ప్రేమలేఖ. తరువాత ఎప్పుడూ ఏదీ తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. దానంతట అదే తెలుస్తూ వచ్చింది. ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంది.
త్వరలో మరో మంచి అంశంతో మీ ముందుంటా... అప్పటి వరకూ మీ అభిప్రాయాల కోసం ఎదురుచూస్తూ... శెలవు తీసు కుంటున్నాను.
ఇట్లు
ప్రేమికుడు :-)

2 కామెంట్‌లు:

  1. మీ ప్రెమలెఖ చాలా బాగుంది, మీ జ్గ్నపకాలు చాల బాగున్నవి. మీ శైలి బగుంది.కాని మీరు అందరి పెర్లు మార్చి పెదిటె బాగా ఉందెది.ఇధి నా అభిప్రాయం మాత్రమె.

    అదిత్య మాధవ్

    రిప్లయితొలగించండి
  2. మీ అభిప్రాయానికి ధన్యవాములు.వీరు పేరు తప్ప అందరి పేర్లూ మర్చాను. అది అంత అవసరం లేదనిపించింది.

    రిప్లయితొలగించండి