
కారు మబ్బులాగ కమ్మని కబురు లాగ
చల్లని చినుకు లాగ చెలి నగవు లాగ
నేడు నల్లనయ్య మా ఇంటికీ వచ్చాడు
మలయ మారుతమై వచ్చాడు
తెలియని మాయేదో చేశాడు
మెరిసే మెరుపై వచ్చాడు
కనికట్టు చేసి వెళ్లాడు..
చూసే చూపులో పలికే మాటలో...
నా ఉచ్ఛ్వాసలో నిచ్ఛ్వాసలో...
మదిలో మెదిలే ప్రతి ఊహలో...
అన్నిటా తానే అయి వెలుగొందాడు
రాతి హృదయము కదానాది
మరి ఆర్ద్రమేల ఆయెనో కదా..?
లీలా మానుష విగ్రహుని
ప్రేమకు పులకించుటే తెలుసును
అతని వేణు నాదాన ...
మది మరులు గొలుపుటే తెలియును
అతని ఎదుట నే పురుషుని కాదా
రాధలా ఇంత ఆరాట మేలనో?
ఏమో వెదురును వేణువు చేసి
మదిని మరపించినా...
కాళింది సరసులో కాలనాగు
పడగల పై నాట్యమాడినా...
ప్రాణులన్నిటిని పకృతిగ చేసి
పురుషోత్తముడు తానై ఏలినా...
అంతా అతని మాయే కదా..
వద్దు వద్దు అనుకుంటూనే ఉంటాను
ఈ క్రిష్ణుని ఆగడాలు ఇక చాలనుకుంటాను
చిన్న పిల్ల వాడిలా వస్తాడు
అల్లిబిల్లి మాటలేవొ చెప్తాడు
కమ్మని కలలా వస్తాడు
ఓపలేనంత విరహమిచ్చి వెళతాడు
అమ్మలోని అమాయకతలా...
ఆనంద అంబుధిలా ..
కదిలే కాలంలా...
ప్రవహించే నదిలా..
మాటి మాటికీ వస్తాడు మురిపాల తేలుస్తాడు
ప్రేమలో నను ముంచి వేస్తాడు...
అలాటి కృష్ణుడు నేడు మా ఇంటికీ వచ్చాడు
వర్షించే మేఘమై
కారు మేఘాలలో మెరిసే మెరుపై
నను నిలువునా తడిపే తలపై...
పుట్టిన రోజున ఎవరైనా అందరినీ విందుకు పిలవడం పరిపాటి. మరి మన నల్లయ్యేమో తానే అందరిళ్లకూ వస్తాడు. పాలు వెన్నలతో పాటు మన మనసులను దోచుకు వెళతాడు. అయినా తానంటే మనకు తీరని మక్కువ. చూసినకొద్దీ చూడాలనిపిస్తాడు. అతని ప్రేమను పొందిన కొద్దీ మరింత పొందాలని పిస్తుంది. అదే కృష్ణ మాయ.
అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
