
వెన్నెల కూడా వేడి సెగలైన వేళ
సెలయేటి గల గలలు వెదురు పొదలలో గాలి రాగాలు
మొగలి రేకుల మధుర వాసనలు
ఇంతలో ఆకాశం అంచున ఓ మెరుపు మెరిసింది
మేఘం కరిగింది చినుకు చినుకుగా నేల రాలింది
చిగురుటాకు సిగ్గుతో ఒదిగింది
ఓ చిరు మొగ్గ తొడిగింది
పరుగు పరుగున వచ్చే పైర గాలి
కొమ్మకొమ్మకూ కథలెన్నో చెప్పింది
ఈ మెగ్గ గుండెలో ఆశలెన్నొ రేపింది
మంచు ముత్యమై రాలిన వేళ
తూరుపున వెలుగులు నిండేటి వేళ
ఆ మొగ్గ విరిసింది వగలెన్నొ నేర్చింది
అందమంత నాదంది ఆకాశమే హద్దంది
గాలికే రాగాలు నేర్పింది ప్రకృతికే పరిమళాలు అద్దింది
ఈ గాలి రాగాలు విన్నాడో, పరిమళాలు కోరాడో
ఓ తేనె దొంగ రంగు రంగుల రెక్కలు పూని
గండు తుమ్మెద నేను నిండు పున్నమి నీవంటు
కవితలే చెప్పాడు కలలెన్నొ రేపాడు

కలలో ఏమేమి చూసిందొ ఆ చిన్ని పువ్వు
తానుగా వలచింది
మధువులే చిలికింది అమరుణ్ణి చేసింది
అమృతాన్ని పొందిన అమ్మరుణ్ణి నేనంటు
ఆకాశానికెగిరాడు ఆ పూల రంగడు
రెక్కలల్లార్చాడు మెరుపులా మెరిశాడు
క్రీ గంట చూశాడు
సిగ్గుల మొగ్గైన ఆ పూబాల
మళ్లీ వస్తాడు నారేడు నన్ను వీడి మనలేడు
అని మదిని తలచింది
రేయి గడిచింది పగలు గడిచింది
నాడు వెళ్ళినా ఆ తేనె దొంగ
మరలి రాలేదు
అతని రాకకై చూసి చూసి
వలపులన్ని వేదనల తలపులవగా
ఆశలన్ని అడియాశలవగా
వగచి వగచి ఆ చిన్ని పువ్వు
తీగ వీడింది.., నేల రాలింది...

