About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

9, నవంబర్ 2009, సోమవారం

మా డాబా మీది నుండీ....

కంటికి ఎదురుగా ఇళ్లు కట్టకుండా వదిలేసిన విశాలమైన స్థలాలలో మొలిచిన పచ్చగడ్డి...., స్థలాలకు మధ్య మధ్యలో అక్కడక్కడా మొలిచినట్లున్న చిన్న చిన్న డాబాలు, అపార్టుమెంట్లూ... ఊరిచివరి ప్రదేశం కావడంతో మా కాలనీకి కాస్త దూరంలో గుబురుగా అలుముకున్న చెట్లు, ఒకటి రెండు పెద్ద పెద్ద రాళ్ల గుట్టలూ....



పైన ఆకాశంలో మబ్బులు సూర్యుడితో దోబూచులాడుతున్నాయి. మిట్ట మధ్యాహ్నమైనా పకృతి అంతా వెలుగు నీడలతో ఆహ్లాదంగా ఉంది. మా ఇంటికి ఈశాన్యంగా ఉన్న దేవాలయం పై కాషాయపు జెండాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. దూరంగా ఖాళీ స్థలాలలొ వేసుకున్న చిన్న చిన్న గుడారాలు. వాటి మధ్యలో పెరిగిన తుమ్మ చెట్లు నగర జీవులకి మేమే మహావృక్షాలం అని విర్రవీగుతున్నట్లుగా తలలు ఊపుతున్నాయి. తుమ్మ చెట్ల క్రింద పిల్లవాడొకడు వాళ్ల నాన్న చొక్కా అనుకుంటా వేసుకున్నాడు. తలకాయ, కొద్ది కొద్దిగా కాళ్లూ చేతులూ మాత్రమే కనపడుతున్నాయి. ఆనందంతో చొక్కా పట్టుకుని గెంతుతున్నాడు. ప్రక్కనే దారిలో కోడి పెట్టలు తిరుగుతున్నాయి.

గడ్డిలో పెరిగిన చిన్న మొక్కలకు అక్కడక్కడా పూచిన పూలను సీతాకోక చిలుకలు పలుకరిస్తున్నాయి. పైన ఎండ చురుక్కు మంటోదే అనుకునేంతలో సూర్యుణ్ణి మబ్బు కమ్మేసింది. చల్లటి గాలి వచ్చి పలకరించి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ తనతో పాటు నన్నూ నా బాల్యానికి తీసుకు వెళ్లింది.



అక్కడా ఇదే ప్రకృతి. కానీ ఇంత కంటే ఎక్కువచెట్లు. బిల్డింగులు తక్కువ. కాస్త పల్లెటూరు. కావలసినంత ఖాళీ ప్రదేశం. ఖాళీ స్థలాలలో పెరిగే సీతమ్మవారి జడ మొక్కలు. ముట్టు కుంటే ముడుచుకునే మొక్కలు.. ఇలా రకరకాలు. వర్షాకాలం వెళ్తోందంటే పూల పొందుకై పరుగులు పెట్టే సీతాకోక చిలుకలు రకరకాల చీరలు కట్టేవి. చేతికి చిక్కకుండా మోజును మరింత పెంచేవి. ఆడ పిల్లలు పూలను కోసి ముక్కుపుడకల్లా పెట్టుకుని ఎలా ఉంటామోనని చూసుకునే వారు. గాలి పటాలతో , గోటీ బిళ్లల తో రోజంతా గడిపే వాళ్లం.


ఏదో గువ్వపిట్ట అరుపుతో ప్రస్థుతానికి వచ్చాను. ఇక్కడా అదే అనుభూతి కలుగుతోంది. అనుభూతి సామీప్యం వల్లనేనేమో చిన్నతనపు రోజులు గుర్తుకు వచ్చాయి. కంటికి కనిపించే దాంట్లో ఇప్పటికీ, నా బాల్యానికీ చాలా వ్యత్యాసం ఉంది. కానీ కలిగే అనుభూతిలో మాత్రం తేడాలేదు. అంతే ఆనందం, అదే ఉత్సాహం.

ప్రక్క డాబాపై వాలిన పావురాలు గువ గువ మంటూ శబ్దం చేస్తున్నాయి. దూరంగా ఉన్న గుడిసెల దగ్గరి పిల్లవాడు. తనకంటే చిన్న పిల్లని ఎత్తుకుని పరుగులు పెడుతున్నాడు. ప్రక్కనే ఉన్న ఆల మందలో నుండి దూడ ఒకటి తోక పైకి మడిచి గెంతుతూ పరిగెడుతోంది. గాలి కొత్త ఊసులేవో మోసుకొస్తోంది. ఇసుకలో మొలిచిన రెండు మొక్కలు ఒకదానిపై ఒకటి వాలి గుస గుసలాడుతున్నాయి. నాలో నిద్రించిన మదిని మేలుకొలుపుతున్నాయి.

" ఆనందం అప్పుడూ ఇప్పుడూ ఎప్పూడూ ఉంది, ఉంటుంది.. దాన్ని గ్రహించే మనసు మనకుంటే అది ఎప్పటికీ మనసొంతం "


అప్పుడప్పుడూ నాకు చేసే పనులన్నీ చిరాకనిపించి వాటికి కొంత విరామమిచ్చి, కొత్తగా ఏదైనా మొదలు పెడుతుంటాను. రోజులు అన్నీ ఒకేలా గడపడం నాకిష్టం ఉండదు. అలాగని రోజుకో కొత్త జీవితం కోరుకోను. చేసే పనులే కొత్త రకంగా చేస్తాను. లేదా కొత్త పనులు ప్రారంభిస్తాను. అలా ప్రారంభించిన వాటిల్లో బ్లాగు రచనావ్యాసంగమూ ఒకటి. నేను రాసే వాటికంటే తోటి బ్లాగరుల రచనలు చదివేవే ఎక్కువ. కుదిరినప్పుడల్లా బ్లాగుల లోక మంతా తిరుగుతుంటాను. ఒక్కో బ్లాగూ నాకు ఒక్కొ కథ చెప్తూ ఉంటుంది. ఆనంద నందనాలు కొన్నైతే, జ్వలించే హృదయాలు కొన్ని. కొన్ని కాలక్షేపం కబుర్లు చెప్తాయి. కొన్ని కన్నీటి కథలు చెప్తాయి. మరికొన్ని విఙ్ఞానాన్నిస్తాయి. అలా అలా పలకరిస్తూ , తోచిన వ్యాఖ్యలు రాస్తూ ఉంటే ఏదో ఆనందం. ఎవ్వరూ స్నేహితులుగా లేని ఖాళీ బ్లాగుని చూస్తే నాకు అలా వదలబుద్ధికాదు. బ్లాగుకు నేనే మొదటి స్నేహితుడినవ్వాల్సిందే. అదో తృప్తి. :):)

ఇలా ఆనందం కోసం చేసే బ్లాగు రచన కూడా ఒక్కోసారి ముందుకు సాగనంటుంది. దానికి కారణం ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని, కూర్చొని విసుగెత్తడం కావచ్చు. అప్పుడప్పుడూ ఎక్కువయ్యింది అనిపించి కాస్త కంప్యూటర్ కి దూరంగా కొన్నాళ్లుంటాను. నా పనుల మీద దృష్టి పెడతాను. మళ్లీ కొత్త ఉత్తేజంతో మొదలు పెడతాను.


ఇలా కంప్యూటర్ ని కాస్త అదుపులో పెట్టిన రోజుల్లో సారి మా డాబా మీదికి ఎక్కి కూర్చుని చుట్టూ ప్రకృతిని పలకరించే ప్రయత్నం చేశాను. ఎందుకో నాకు తెలియకుండానే మనసు చాలా ఆనందంతో నిండి పోయింది. షో అన్నట్లు " ఆనందం అనేది నువ్వు వెతికితే దొరికేది కాదు. దానంతట అది నీకు ఎప్పుడైనా కలుగ వచ్చు. అది ఓ చెట్టుకింద నువ్వు కూర్చున్నప్పుడు కూడా కావచ్చు. "