About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

31, జులై 2009, శుక్రవారం

ప్రణవం...


ప్రణయంలా సృష్టిని చేసినా...
ప్రళయమై లయం చేసినా...
అన్నింటా ఒకటే ఉన్నది


కదిలే మబ్బులు... కదలని కొండలు....
కురిసే చినుకులు... కులికే నడకలు...
వీచే గాలులు... విరిసే నగవులు...
అన్నిటా ఒకటే ఉన్నది

మాటలలో తేలదు
చూపులకు చిక్కదు
ఆత్మలోన ఇమిడినది
అందరూ పొందలేనిది

అందుకే...

నాలో నేనే జ్వలిస్తుంటాను...
ద్వేషపు విషాన్ని హరించాలని

నలుగురిలో నన్నే దర్శిస్తుంటాను...
ప్రేమను పంచాలని

మౌనంగా ఏకాంతాన్నే వరిస్తుంటాను...
చలించని చిత్తాన్ని చేబూనాలని

మనసుని పదే పదే మధిస్తుంటాను...
ఆనందామృతం వెలువరించాలని

ప్రణయంలా సృష్టిని చేసినా...
ప్రళయమై లయం చేసినా...
అన్నింటా ఒకటే ఉన్నది
ప్రణవమే కదా మూలమైనది.

18, జులై 2009, శనివారం

ప్రకృతీ పురుషుల అనురాగ సంగమ వేళ...



వానలో తడిచిన ప్రతీసారీ
ఆనందంతో ముద్దయ్యే నా మనసుని
చూసి నాకో సందేహం వస్తుంది.
"నాన్ను గాక నా మనసును తడిపే శక్తి
ఈ వాన నీటికి ఎక్కడిదీ...?" అని.

అందుకు సమాధానం ఇలా అనిపిస్తుంది...


ప్రకృతి విరహ గీతికిలకు
పురుషుడు నిలువెల్లా కరిగి
ప్రేమ చినికులై ప్రకృతి
తనువంతా తడిపేస్తాడు
ఆమె అణువణువునూ శృతి చేస్తాడు...

అతని వలపు స్పర్శతో
పులకించిన పుడమి
శ్రీ గంధపు పరిమళాలను వెలువరిస్తుంది
ఆ ప్రేమ ధారలను
అనురాగంతో ఆలింగనం చేసుకుంటుంది
ఆత్మలోన ఇముడ్చుకుంటుంది...

ఈ ప్రకృతీ పురుషుల
అనురాగ సంగమ వేళ
ప్రకృతీలో అణువు లాంటి నేనూ
అతని ప్రేమలో తడిచాను...
పరవశించాను...

16, జులై 2009, గురువారం

వేడుకోలు


కృష్ణా..!
నీ మురళీ గానంతో మాయ చేసి
మనసు గాయాలను సైతం మాన్ప గలవట..
నీ మోహన రాగానికి
ప్రకృతి మొత్తం పులకిస్తుందట..



అన్నీ తెలిసిన వాడిలా ఉండుటకన్నా
అమాయకుడిలా బ్రతకటం మేలని తెలియక...



ప్రతీదీ తెలుసుకోవాలని
తాపత్రయ పడ్డాను...



తీరా తెలిసిన కొద్దీ
అనుభవానికి వస్తున్న కొద్దీ
లోకం పోకడకు నా మనసు పగిలిన కొద్దీ
బాధతో నలిగి పోతున్నాను...



తెలియక చేసిన నేరమిది ప్రభూ..!
ఇక నాకేమీ తెలుసుకోవాలని లేదు
ఏ ప్రతిభా నిరూపించాలని లేదు...


ఈ స్వార్ధ ప్రపంచంలో కూడా
మంచిని మాత్రమే చూడగలిగే
ఆ అమాయకత్వమే నాకు కావాలి.



స్త్రీని దేవతగా పూజించ గలిగే
సాటి మనిషిని మనిషిగా ప్రేమించ గలిగే
చెడుని క్షమించి మంచిని మాత్రమే గుర్తించగలిగే
ఆ అమాయకత్వమే నాకు కావాలి.

అలా జరగాలంటే...
నా మనసును కమ్మిన
మేఘాలు తొలగిపోవాలి...

ఆ శక్తి నీకే ఉందని, నీవు మాత్రమే
నాలోని ప్రెమను వేయింతలు చేయగలవనీ...

తొలి వెలుగు కన్నా, చిరు జల్లు కన్నా...
నీ వేణు గానానికి ఉన్న శక్తి అమితమని నమ్మి...
నీ చరణాలపై వాలి వేడుకొంటున్నాను...

ఓ ప్రభూ..!

మా మనసులకు పట్టిన మాలిన్యాన్ని కడిగివేసి
నిత్య ఉత్సాహంతో.. ఆనందంతో...
జీవించ గలిగే శక్తిని ప్రసాదించు ప్రభూ..!