About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

27, మార్చి 2009, శుక్రవారం

ఈ నూతన తెలుగు సంవత్సరంలో...



కోయిల గొంతులోని తియ్యదనం
మావి చిగురులోని పచ్చదనం
వసంతపు సంధ్య లోని ఆహ్లాదం
ఆస్వాదిస్తూ మనసులు మురియాలి.

వేపపూత లోని సుగుణాలు
చెరకు తీపి వంటి ప్రేమలతో
ఆ మనసులు నిండాలి,
ప్రతి బ్రతుకూ పండాలి.

మన బ్లాగులు కమ్మని కవనాలతో
మది నమ్మిన భావాలతో
తెలుగు పూలు పరవాలి.
చదివిన ప్రతి హృదయంలో
ఆనందపు అమృతం కురియాలి.

బ్లాగు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
-విశ్వ ప్రేమికుడు

6, మార్చి 2009, శుక్రవారం

నాకేం తెలుసు? ఫెమినిజానికి ఈ నిజం నచ్చదని...

పట్టు పావడలో, పారాణి రాసిన,
పసిడి పట్టీల పాదాలను ముద్దాడాలనుకున్నాను.
ముంగిట ముగ్గులేస్తుంటే
కబుర్లతో కవ్విద్దామనుకున్నాను.
తను వంట చేస్తుంటే
వెనుకగా వెళ్లి కౌగలించాలనుకున్నాను.
వడ్డించి తినిపిస్తుంటే ఆమె ఒళ్లో పడుకుని
ముద్ద ముద్దకో ముద్దును లంచంగా తీసుకోవాలనుకున్నాను.
నేను రాళ్ళు మోసినా, రాజునైనా ఆమెను మాత్రం
నా ఇంటికి రాణిని చెయ్యాలనుకున్నాను.

నాకేం తెలుసు? ఫెమినిజానికి
ఈ నిజం నచ్చదని...
వారి స్వేచ్చను నేను హరిస్తున్నానని...
మగవాడికి ఇలాంటి కోరికలు ఉండరాదని....

ఎందుకంటే ఏమని చెప్పను?
ఇలాంటి కోరికలతోటే మొగవారు
ఆడవారిని వంటింటి కుందేళ్లను చేస్తున్నారట..
వారికి స్వేచ్చ కావాలట..
ఇంటి చాకిరీ నుండి విముక్తి కావాలట..
పైకి ఎంతో అందంగా కనిపించే ఇలాంటి
కోరికల వెనక పెద్ద వంచన ఉందట..!

నాకేం తెలుసు? ఫెమినిజానికి
ఈ నిజం నచ్చదని...
దీని వెనుక ఇంత పెద్ధ కథ ఉందనీ..!


స్త్రీని గౌరవించే, పూజించే నాలో
ఇంత వంచకుడున్నాడా..!
అని ఆలోచనలో పడ్డాను.

నేను అలా ఎందుకు కోరానంటే..
కారణమేమని చెప్పను?
"అమ్మను చూశాను గనుక"
అలాంటి అమ్మాయినే భార్యగా కలగన్నానని...
ఎంత లేవని బుకాయించినా మగవాళ్ల
అంతరాంతరాలలో ఉండేది ఇలాంటి కోరికలేననీ...
ఎలా చెప్పను? చెప్పినా మన్నించేదెవరు?
ఏది ఏమైనా వారి మనసు నొప్పించే పని చేయలెను. వారికీ స్వేచ్చ ఇవాలనీ గుర్తించాను. నేనే కాదు స్త్రీని ప్రేమించే చాలా మంది అలాంటి కలలకు స్వస్తి చెప్పారు, చెప్తున్నారు. కానీ నాకొక్కటే అనుమానం.. వారుకోరుకున్న స్వేచ్చ వారికి లభించిందా..? అని. డబ్బు సంపాదనలో వారు బంధీలవుతున్నారేమో అని.

5, మార్చి 2009, గురువారం

మన స్నేహం


ఇవ్వడమే గానీ
ఆశించడం తెలియదు స్నేహానికి
నీ కష్టంలో ధైర్యాన్నౌతా...
బాధలో ఓదార్పునిస్తా...
నా సుఖంలో చిరునవ్వు కావాలి నువ్వు...
ఆనందానికి ప్రతినిధులం మనము...
అంటుంది మన స్నేహం.