About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

23, ఫిబ్రవరి 2009, సోమవారం

యద్భావం తద్భవతి

దూరంగా ఓ ఆకారం కనిపించింది
ఒకని అనుమనపుటద్దంలో పెనుభూతమై నిలిచింది
పసిపాప తన తల్లేమో అనుకుని అమ్మా అని పిలిచింది
తాత్వికుడేమో తన తపో ఫలమన్నాడు
నేననుకున్నా నా కవన్నాన్ని మెచ్చి వచ్చిన
రసజ్న మనోజ్ఞా సుందరియే ఆమె అని

16, ఫిబ్రవరి 2009, సోమవారం

నువ్వున్నది ఎక్కడ?


గతించిన జ్ఞాపకాల లోనే
మనసును సమాధి చేస్తావు
ఆ పూల పరిమళాలనే తలచుకుంటూ
ఈ వెండి వెన్నెలలో మల్లె తీగలను
చూచుట విస్మరిస్తావు
గతమెంతో మధురమంటావు
నాడు అనుభవించింది స్వర్గమంటావు
మరి ఇప్పుడు నువ్వున్నది ఎక్కడ?

ఆ గతించిన రోజులు తిరిగి రావాలనుకుంటావు
దానికై ఏదైనా సాధిస్తానంటావు
నీ కలల లోకం నిర్మిస్తానంటావు
మరి ఇపుడున్న స్థితినేమంటావు?
నువ్వున్నది ఎక్కడంటావు?

మనసును ప్రస్థుతానికి తీసుకువస్తే...
నీ చుట్టూ ఉన్నది అవలోకిస్తే...
స్నేహ పూదోట నుండి వీచే
ఈ గంధపు గాలులను ఆఘ్రాణిస్తే...
గమ్యం కోసం వేసే నీ ప్రతి అడుగునూ
ఓ మధురానుభూతిగా మిగిల్చే
ఈ క్షణాన్ని ఆస్వాదిస్తే...

తెలుస్తుంది
ఇంత అందం ఇది వరకు ఎన్నడూ ఎరగనిదని...
నువ్వున్నది స్వర్గంలోనేనని..

14, ఫిబ్రవరి 2009, శనివారం

నా కోరికలు

నేనో విహంగమై విను వీధుల విహరించాలి...
ప్రకృతి కాంత పరువాలు వొకపరి పరికించాలి...
మబ్బులతో మాటాడాలి...
మామ చంద్రునికో ముద్దు పెట్టాలి...
హిమగిరి పర్వతాలు ఎక్కి ఆడాలి..
కాశ్మీరమంతా కనులారా వీక్షించాలి...
ప్రపంచ శాంతి కపోతమై జీవించాలి...

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

బ్లాగు లోకంలో కాకులు ప్రవేశించాయట..!



నేను బ్లాగు ప్రారంభించి నెలరోజులు అయినట్లుంది. నేను ప్రారంభించేనాటికి ఏ బ్లాగుని తెరిచినా సాదరంగా ఆహ్వానించేవారు. తమ మనసును అందంగా మన ముందు పరిచేవారు. కొందరు తమ రచనలతో చక్కటి సౌరభాలను వెదజల్లితే, కొందరు దారంతా మల్లెలు పరిచేవారు. తమ ఆనందాన్నైనా, చుట్టూ ఉన్న ప్రపంచంలోని బాధలనైనా హృద్యంగా వ్యక్త పరిచేవారు. ఎవరు ఏది చెప్పినా, ఎలా పలకరించినా ఒక అందం కనపడేది. బ్లాగరులు విభిన్న దృక్పధాలు కలిగిన వారు. ప్రతి ఒక్కరికీ ఓ వైవిధ్యత ఉంది. కానీ కొంచెం తరచి చూస్తే ఈ కధనాలన్నిటి వెనుకా ఏకసూత్రత కనిపిస్తుంది. తమకు తోచిన మంచిని నలుగురికీ చెప్పాలి అనే ఆతృత ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఆ ఆరాటం నాకు చాలా చాలా నచ్చింది.
తెలుగుకు కాలం చెల్లింది అని అన్నవారి భ్రమలు పోగొట్టే విధంగా అంతర్జాలంలో ఓ వెలుగును నింపుతున్న వీరందరూ మహా పండితులు కాక పోవచ్చు. కానీ "వారు రాసే ప్రతి అక్షరం చరిత్రను లిఖిస్తోంది. చెప్పే ప్రతి మాటా భవిష్యత్తును ప్రశ్నిస్తోంది." వీరి లక్ష్యం ఒక్కటే. తమ మనో భావాలను నలుగురితో పంచుకోవాలనే. దానికి ఆ నలుగురి స్పందన చూడాలనే. అంతే... అంతకంటే ఎక్కువేమీ ఆశించలేదు ఎవ్వరూ. అందుకే ఈ బ్లాగులు నాకు చాలా బాగా నచ్చాయి. కొత్తగా రాసే వారి దగ్గరనుండీ, ఎంతో అనుభవం ఉన్నవారి దాకా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేనూ ఉడతా భక్తిగా ఏదో ఒకటి ప్రారంభిద్దాం అనుకున్నాను. ఉత్సాహంతో బ్లాగు తెరచాను.
కానీ ఈ నెలలో పరిస్థితులలో కాస్త మార్పు వచ్చింది. ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆహ్వానించే కొందరు బ్లాగరులు కొత్తగా బ్లాగులోకి ప్రవేశించడానికి కొన్ని షరతులు పెట్టారు. మరి కొందరు బ్లాగులని మూసివేయాలి అనుకోవడం కూడా అక్కడక్కడా వినిపిస్తోంది. ఇందుకు కారణం "బ్లాగు లోకం లోకి కొన్ని కాకులు ప్రవేశించాయట..! పేరులేని ఈ కాకులు ప్రతి బ్లాగులోకీ ప్రవేశించీ నోటికొచ్చిన కారు కూతలు కూస్తున్నాయట..!" ( నువ్వూ సొంత పేరు చెప్ప లేదు కదా!? నువ్వూ ఆ కాకుల గుంపులో ఒకడివా..? అంటారేమో... ఎంత మాత్రమూ కాదండోయ్.. `మచి పని చెయ్యడానికి పేరుతో పనేముందీ' అనుకునే తత్వం నాది. `ముసుగులో ఉంటే ఏమైనా చెయ్యొచ్చూ' అనే తత్వం వారిదీ.) ఇంతకీ ఏ కారుకూతా నేను ప్రత్యక్షంగా చూడలేదు. తప్పొప్పులు ఎవరివి ఎంతో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం స్పష్టమైంది. "కొందరి రాతల వల్ల మరికొందరికి మనస్థాపం కలిగింది. అది అంతటితో ఆగక ప్రతి బ్లాగులో చర్చనీయాంశం అయ్యింది." ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే ఈ బ్లాగులు ఎవరి కారుకూతల వల్లో మూతపడతున్నాయంటే బాధ వేసింది. ఆంతటి అనుభవజ్ఞులే కాకుల గోలకు తల్లడిల్లు తున్నారే... రేపు ఆ పరిస్తితి మాబోటి పిల్లకాయలకి ( కొత్తవారికి) ఒస్తే..? అనే అనుమానం వచ్చింది. కాబట్టి మాకు మార్గం చూపడం కోసమైనా వీరు బ్లాగులని కొనసాగించవలసిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి మనం. ఆ కాకులకీ మనసనేది ఉంటుంది. ఇప్పుడు కాకపోతే మరో రోజు తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడతారు. పశ్చాత్తాపం బండరాయిని కూడా కరిగిస్తుంది. వారుకూడా మరో మంచిపనుకి పూనుకునేలా చేస్తుంది. ఆ రోజు వస్తుందని ఆసిద్దాం. ఇక మనస్థాపం కలిగిన బ్లాగరులు ఈ పరిస్థితిని కూడా తమ విజయానికి బాటగా మలచుకో గలగాలి. వారి మాటలు ( నిజమైనా, అబద్దమైనా) కూడా మనకి కొన్ని పాఠాలు నేర్పొచ్చు. నిజాయితీగా ఆ పాఠాలు ఏమిటో గ్రహించి ముందుకు సాగిపోవడమే తెలివైన పని.
మన మనసులో భావాలు ఇతరులకి బాధ కలిగించ కుండా ప్రదర్శించడం ప్రతీ బ్లాగరూ నేర్చుకోవలసిన కళ. ఒక వేళ మంచి చెప్పవలసి వచ్చినా నొచ్చుకోకుండా చెప్పడం విజ్ఞత అనిపించుకుంటుంది. ఏది ఏమైనా ఈ రచనలు చేయాలనుకునే వారికి కాస్త మనస్సాక్షి ఉంటుందని నేను నమ్ముతాను. దానికి కట్టుబడి ఉందాం. మన రచనల ద్వారా మంచి జరగక పోయినా ఫర్వాలేదు, చెడు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క రికీ ఉంది. ఆ దిశగా అందరం ప్రయత్నిద్దాం. ప్రేమికుడు :)